త్రిముఖ పోటీ | Sakshi
Sakshi News home page

త్రిముఖ పోటీ

Published Sat, May 4 2024 6:30 AM

త్రిమ

నవరంగపూర్‌

ఎంపీ స్థానానికి..

జయపురం: నవరంగపూర్‌ (ఎస్టీ) లోక్‌ సభ స్థానంలో నలుగురు బరిలో ఉండగా.. వారిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు మఝి సంప్రదాయ గిరిజనులే. కాంగ్రెస్‌ అభ్యర్థిగా భుజబల మఝి, బీజేడి అభ్యర్థిగా ఫ్రదీప్‌ మఝి, బీజేపీ అభ్యర్థిగా బలభధ్ర మఝి పోటీలో తలపడనున్నారు. ఈ నియోజకవర్గంలో బరిలో ఉన్న సోషలిస్టు యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) పార్టీ అభ్యర్థి త్రినాథ్‌ మండగుడియ పోటీలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో 1952, 1962 ఎన్నికల్లో ఇద్దరు తెలుగువారు ఎన్నకయ్యారు. 1952లో పొన్నాడ సుబ్బారావు (గణతంత్ర పరిషత్‌) గెలుపొందారు. 1962 ఎన్నికల నాటికి నవరంగపూర్‌ లోక్‌ సభ నియోజకవర్గం తిరిగి జనరల్‌ స్థానంగా విభజించారు. ఆ ఎన్నికలో మరో తెలుగు నేత రాచకొండ జగన్నాథరావు(కాంగ్రెస్‌) విజయం సాధించారు. 1967లో ఈ స్థానాన్ని ఎస్టీలకు కేటాయించారు. ఈ ఎన్నికలలో ఖగుపతి ప్రధాన్‌ (కాంగ్రెస్‌) గెలిపొందారు. తరువాత జరిగిన 1971, 1977, 1980, 1984, 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో ఈయన వరుసగా విజయాలు సాధించారు. ఈయన తరువాత నవరంగపూర్‌ నియోజకవర్గంలో మఝి సంప్రదాయ నేతల ఆధిపత్యంలోనికి వచ్చింది. 1999 ఎన్నికల్లో ఈ స్థానం బీజేపీ కై వసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి పరశురాం మఝి విజయం సాధించారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థి పరశురాం మఝి ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. 2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ కుమార్‌ మఝి మొదటి సారిగా ఎన్నికల బరిలో దిగి బీజేపీ అభ్యర్థి పరశురాం మఝిని, బీజేడీ అభ్యర్థి డొంబురు మఝిలను ఓడించారు. 2004లో ఈ స్థానంలో ఘన విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పరశురా మఝి 2009లో కేవలం 1,56,784(19.8 శాతం) ఓట్లు మాత్రం పొంది మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రదీప్‌ మఝి 3,08,307 (38.93 శాతం) ఓట్లు పొందారు. బీజేడీ అభ్యర్థి డొంబురు మఝి 2,78,330 (35.15శాతం) ఓట్లు సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో బీజేపీ విజయానికి బలమైన కారణం ఉమ్మరకోట్‌, ఝోరాగాం, మల్కనగిరి, చిత్రకొండ అసెంబ్లీ సెగ్మెంట్లలో శరణార్థ బెంగాలీల ఓట్లు వల్లేనని పరిశీలకుల విశ్లేషణ. తరువాత పరిస్థితులు మారాయి. 2009లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 2014 లో బీజేడీ అభ్యర్థి బలభద్ర మఝి గెలిపొదారు. సిట్టింగ్‌ ఎంపీ అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి పరశురాం మఝిని కేవలం 2042 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ నియోజకవర్గంలో రెండు పర్యాయాలు విజయం సాధించిన బీజేపీ ఓట్ల శాతం పడిపోయి మూడో స్థానానికే పరిమితమైంది.

2019లో ఈ నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ జరిగింది. కాంగ్రెస్‌ నుంచి ప్రదీప్‌ మఝి, బీజేడీ నుంచి రమేష్‌ చంద్ర మఝి, బీజేపీ నుంచి బలభద్ర మఝి, బీఎస్పీ నుంచి చంద్రద్వజ మఝి తలపడ్డారు. ఆ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ జరిగింది. కాంగ్రెస్‌ అభ్యర్థిపై 41,724 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి రమేష్‌ మఝి విజయం సాధించారు. బీజేడీకి 3,92,504 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌కు 3,50,870 ఓట్లు, బీజేపీకి 3,42,839 ఓట్లు, బీఎస్పీకి 28,905 ఓట్లు, నోటాకు 44,582 ఓట్లు పడ్డాయి. ఈ ఎన్నికల్లో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు చోట్ల బీజేపీ విజయం సాధించగా.. 5 చోట్ల బీజేడీ అభ్యర్థులు గెలుపొందారు. 41 వేల ఓట్లతో పరాజయం పొంది రెండో స్థానంలో నిలిచిన కాంగ్రెస్‌కు ఒక్క అసెంబ్లీ స్థానం దక్కలేదు. ఈ నెల 13వ తేదీన జరుగనున్న ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలొ చతుర్ముఖ పోటీ ఉండనుంది. 2019లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ ఎంపీ ప్రదీప్‌ మఝి బీజేడీలో చేరారు. నేడు ఈయన బీజేడీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2014లో బీజేడీ టికెటుపై పోటీ చేసి విజయం సాధించిన బలభధ్ర మఝి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా డాబుగాం ఎమ్మెల్యే భుజబల మఝి తలపడుతున్నారు. ప్రధానమైన పోటీ కాంగ్రెస్‌, బీజేడీ, బీజేపీల మధ్యేనే ఉంటుందని పరిశీలకుల విశ్లేషణ. నవరంగపూర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో నవరంగపూర్‌ జిల్లా నుంచి నవరంగపూర్‌, డాబుగాం, ఉమ్మరకోట్‌, జోరిగాం, కొరాపుట్‌ జిల్లాలోని కొట్‌పాడ్‌, మల్కనగిరి జిల్లాలో మల్కనగిరి, చిత్రకొండ అసెంబ్లీ సెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.

త్రిముఖ పోటీ
1/2

త్రిముఖ పోటీ

త్రిముఖ పోటీ
2/2

త్రిముఖ పోటీ

Advertisement
Advertisement