మాకు ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌: కాంగ్రెస్‌ ఎ‍మ్మెల్యే బెదిరింపు! | Sakshi
Sakshi News home page

మాకు ఓటు వేయకుంటే కరెంట్‌ కట్‌: కాంగ్రెస్‌ ఎ‍మ్మెల్యే బెదిరింపు!

Published Thu, May 2 2024 7:04 AM

Congress MLA Raju Kage Threatened People

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపధ్యంలో పలు ఆసక్తికర వైనాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోకే వస్తుంది కర్నాటకకు చెందిన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వ్యవహారం. సదరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

కర్నాటకలోని కాగ్వాడ్ ఎమ్మెల్యే రాజు కాగే  ఎన్నికల ప్రచారంలో ఓటర్లను బెదిరించారు. ఓటర్లంతా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌కు ఓటు వేయాలని, లేకుంటే వారి ఇళ్లకు సరఫరా అయ్యే విద్యుత్‌ను నిలిపివేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీకి ఆయుధంగా మారాయి.

రాజు కాగే తన నియోజకవర్గమైన బెలగావిలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియోలో ఆయన ‘నాకు గతంలో కొన్ని చోట్ల తక్కువ ఓట్లు వచ్చాయి. నేను దాని గురించి ఎక్కువగా మాట్లాడను. ఇకముందు మాకు ఎక్కువ ఓట్లు రాకపోతే, అప్పుడు మేము మీ ఇంటికి అయ్యే విద్యుత్తును నిలిపివేస్తాం. దీనిని గుర్తుంచుకోండి నేను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటాను’ అని ప్రజల ముందు వ్యాఖ్యానించడం చూడవచ్చు.

దీనిపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి  పూనావాలా ఈ వ్యాఖ్యలను రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రకటనతో ముడిపెట్టారు. డీకే శివకుమార్ తన సోదరుడు డీకే సురేష్‌కు ఓటు వేయాలని, లేకపోతే మీరనుకున్న పనులు జరగవని ప్రజలతో అన్నారు. ఇది కాంగ్రెస్‌కు ఉన్న అర్హత, అహంకారాన్ని తెలియజేస్తోందని, ఓటర్లను  తమ బానిసలు అని కాంగ్రెస్‌ నేతలు ఎలా అనుకుంటారని పూనావాలా ప్రశ్నించారు.

కగ్వాడ్ అసెంబ్లీ నియోజకవర్గం చిక్కోడి లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఏప్రిల్ 26న రెండో దశలో ఇక్కడ ఓటింగ్ జరిగింది. రాష్ట్రంలోని 28 స్థానాలకు గాను 14 స్థానాలకు రెండో దశలో ఓటింగ్ జరిగింది. మూడో దశలో మిగిలిన స్థానాలకు మే 7న పోలింగ్‌ జరగనుంది.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement