కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డీఎన్‌ఏ ఒక్కటే | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డీఎన్‌ఏ ఒక్కటే

Published Sun, May 19 2024 5:03 AM

Kishan Reddy comments over congress and brs

కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఎన్నికల హామీలు అమలుచేసే శక్తి రేవంత్‌రెడ్డికి లేదు

గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే శక్తి కేసీఆర్‌కు లేదు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి  

హనుమకొండ/భువనగిరి: కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒక్క తాను ముక్కలేనని, జెండాలే వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి దుయ్యబ ట్టారు. శనివారం హనుమకొండ, భువనగిరిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలో కేజీ టు పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై విరుచుకుపడ్డారు. 

2004లో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపించగా, బీఆర్‌ఎస్‌ అధికారంలో వచ్చాక కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే అదే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని విమర్శించారు. 25 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి రింగ్‌రోడ్డును అమ్మిందని, ఐదు నెలల ముందు మద్యం టెండర్లు నిర్వహించిందని, హైదరాబాద్‌లో స్థలాలు అమ్మిందని ఆయన ధ్వజమెత్తారు. 

కాంగ్రెస్‌ పార్టీ జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డిపై ఉందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ డబుల్‌ డిజిట్‌ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేదని కిషన్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్‌ను  ప్రజలు అదరించారు తప్ప.. అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు వేయలే దన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్‌లో జరిగిన నల్లగొండ–వరంగల్‌–ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి కిషన్‌రెడ్డి హాజరై మాట్లాడారు. 

తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని చెప్పారు. తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement