చిరాగ్‌ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా | Sakshi
Sakshi News home page

చిరాగ్‌ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా

Published Thu, Apr 4 2024 7:31 AM

He sold all Lok Sabha tickets 22 Leaders Quit Chirag Paswan Party - Sakshi

పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌ విలాస్‌)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది.  పార్టీకి  షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు  టికెట్‌ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు.

రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు.  అదేవిధంగా  వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్‌), రాజేశ్‌ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్‌, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు.

అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే ​సమయంలో సీనియర్‌ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్‌ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్‌జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్‌ స్థానంలో చిరాగ్‌ పాశ్వాన్‌ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్‌ బంధువు అరుణ్‌ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. 

రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్‌ నేత అశోక్‌ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్‌లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్‌ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం​. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్‌జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు.

అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్‌ పరాస్‌ వైపు మద్దతు పలికినా..  తర్వాత రామ్‌ విలాస్‌ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్‌ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో  ఎల్‌జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్‌, వైశాలీ, సమస్తీపూర్‌, జాముయి. నావాదాలో ఎల్‌జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్‌జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
 
Advertisement