బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేద్దాం | Sakshi
Sakshi News home page

బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేద్దాం

Published Wed, May 22 2024 5:15 AM

బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేద్దాం

నారాయణపేట: బాల్యవివాహాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌హాల్‌లో బేటి పడావో – బేటీ బచావో, బచ్‌ పన్‌ బచావో ఆందోళన్‌, బాల్యవివాహాల నిర్మూలనపై ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతానికి బాల్యవివాహాలు తగ్గినా.. ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాలలో ఆడపిల్లల తల్లిదండ్రులు అవగాహనా రాహిత్యంతో తమ పిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఇకపై అలాంటి ప్రయత్నాలు కూడా జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 12 నుంచి 18 ఏళ్ల వయసు కలిగిన బాలికల వివరాలను సేకరించడంతో పాటు బాల్యవివాహాలతో కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని బచ్‌ పన్‌ బచావో ఆందోళన్‌ ఏజెన్సీ నిర్వాహలను కోరారు. సమావేశంలో డీడబ్ల్యూఓ నరసింహారావు, డీఈఓ అబ్దుల్‌ ఘని, జీసీడీఓ పద్మనలిని, చైల్డ్‌ వెల్ఫేర్‌ లైన్‌ అధికారి తిరుపతయ్య తదితరులు ఉన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

ఊట్కూరు: మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ఊట్కూరులో మండల మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్వశక్తి స్కూల్‌ యూనిఫాం కుట్టు కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈసందర్భంగా యూనిఫాం తయారీ వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల ఉపాధి కోసం స్కూల్‌ యూనిఫాం స్టిచ్చింగ్‌ను అప్పగించినట్లు తెలిపారు. మండలంలోని వల్లంపల్లి, పెద్దజట్రం, బిజ్వార్‌ తదితర గ్రామాల్లో కుట్టు కేంద్రాలను ఏర్పాటుచేసి మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్‌ వెంట డీఆర్డీఓ రాజేశ్వరి, అడిషనల్‌ డీఆర్డీఓ అంజయ్య, ఏపీఎం నిర్మల, సుగుణ, రవి తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement