తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం | Sakshi
Sakshi News home page

తాడిపత్రి పల్లెల్లో భయం.. భయం

Published Fri, May 17 2024 5:35 AM

adipatri villages that have become barren

కేసులు నమోదు చేస్తారంటూ పుకార్లు 

ఇళ్లు వదలి వెళ్తున్న యువకులు, నాయకులు, కార్యకర్తలు 

నిర్మానుష్యంగా మారిన గ్రామాలు 

తాడిపత్రి టౌన్‌: ‘ఏమ్మా.. నీకొడుకు ఇంట్లో లేడా వస్తే ఓ సారి స్టేషన్‌కు రమ్మను...ఏరా ఎక్కడున్నావ్‌..సార్‌ పిలుస్తున్నాడు స్టేషన్‌కు వచ్చి కనపడు’ అని పోలీసులు చెబుతుండడంతో గ్రామీణ ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. పోలింగ్‌ తర్వాత తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిత్యం గ్రామాల్లో జల్లెడపడుతున్నారు. దీంతో పోలీస్‌ బూటు చప్పుళ్ల మధ్య పల్లెల్లో భయం భయంగా బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎన్నికల అనంతరం తాడిపత్రి పట్టణంలో నెలకొన్న అల్లర్ల కేసులతో పల్లెల్లో జనం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. నియోజకవర్గంలోని తాడిపత్రి, యాడికి, పెద్దపప్పూరు, పెద్దవడుగూరు మండలాల్లోని గ్రామాల్లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. యువకులు కనిపిస్తే చాలు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకు వెళుతుండడంతో గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు యువకులు గ్రామాలు వదిలి పారిపోతున్నారు. దీంతో గ్రామాల్లో మహిళలు, వృద్ధులు, పిల్లలు మాత్రమే కనిపిస్తూ  గ్రామాలు నిర్మానుష్యంగా మారాయి.

తమ పిల్లలు ఎక్కడున్నారో..ఏం చేస్తున్నారో..ఎప్పుడు ఏం జరుగుతుందోనని వృద్ధ తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. తాడిపత్రి పట్టణంలో జరిగిన అల్లర్లకు తమ పిల్లలకు ఏం సంబంధమని కొంతమంది యువకుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం, ఏకపక్ష ధోరణి, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతోనే  తాడిపత్రిలో అల్లర్లు జరిగాయని జనం చెబుతున్నారు. ఎప్పుడు ఈ సమస్య సద్దుమణుగుతుందో..తమ పిల్లలు ఎప్పుడు ఇంటికి వస్తా­రోనని పల్లెల్లో వృద్ధులు ఎదురు చూస్తున్నారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement