అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్‌ మార్కెట్లపై అమిత్‌షా | Sakshi
Sakshi News home page

అప్పటిలోపు కొనేసుకోండి.. షేర్‌ మార్కెట్లపై అమిత్‌షా

Published Mon, May 13 2024 3:46 PM

Market Will Shoot Up After June 4 Amit Shah

షేర్‌ మార్కెట్‌పై హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్‌డీటీవీ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. జూన్ 4న ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత షేర్లు అమాంతం దూసుకెళ్తాయని (షూట్ అప్) జోస్యం చెప్పారు. ఆలోపే షేర్లు కొనేసుకోవాలని సూచించారు.

అయితే ఇటీవలి మార్కెట్‌ పతనం గురించి హోంమంత్రి పెద్దగా ఆందోళన చెందడం లేదు. గత ఆరు నెలల వ్యవధిలో, బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 12 శాతం పెరిగింది. అలాగే ఏడాది వ్యవధిలో దాదాపు 20 శాతం పెరిగింది. ‘‘గతంలో కూడా మార్కెట్ చాలా సార్లు పడిపోయింది. కాబట్టి మార్కెట్ కదలికలను నేరుగా ఎన్నికలతో ముడిపెట్టడం సరి కాదు. మార్కెట్ల పతనానికి బహుశా కొన్ని పుకార్లు కారణం కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం.. జూన్ 4 లోపు కొనండి (షేర్లు). తర్వాత మార్కెట్ షూట్-అప్ కానుంది’’ అని అమిత్‌షా వ్యాఖ్యానించారు.

భారత స్టాక్ మార్కెట్ల పయనంపై తాను ఎందుకు ఆశాజనకంగా ఉన్నది అమిత్‌షా వివరించారు. “స్థిరమైన ప్రభుత్వం ఉన్నప్పుడు, మార్కెట్లు బాగానే ఉంటాయి. మోదీజీ మళ్లీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు. కాబట్టి, ఇది నా అంచనా" అని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు మూడు దశలు ఎలా సాగాయని అడిగినప్పుడు తమ పార్టీ 190 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో మొదటి మూడు దశల్లో 283 స్థానాలకు పోలింగ్‌ జరగింది.

Advertisement
 
Advertisement
 
Advertisement