ఆసియా కప్‌ హాకీ నాకౌట్‌ దశకు చేరాలంటే భారత జట్టు ఇండోనేసియాపై కనీసం 15 గోల్స్‌ తేడాతో నెగ్గాలి.

కానీ మన జట్టు సత్తా చాటి అంతకంటే ఒక గోల్‌ ఎక్కువే సాధించింది!

చక్కటి ప్రదర్శనతో ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌ చేరిన మన జట్టు... పనిలో పనిగా పాకిస్తాన్‌ ప్రపంచ కప్‌ ఆశలకు కూడా గండి కొట్టింది.

గురువారం జరిగిన పూల్‌ ‘ఎ’ పోరులో భారత్‌ 16–0 గోల్స్‌ తేడాతో ఇండోనేసియాపై భారీ విజయం సాధించింది.

చివరి క్వార్టర్‌లోనే జట్టు 6 గోల్స్‌ చేయడం విశేషం.

భారత్‌ తరఫున దీప్సన్‌ తిర్కీ 5 గోల్స్‌తో అగ్రస్థానంలో నిలవగా, సుదేవ్‌ బెలిమగ్గ 3 గోల్స్‌ సాధించాడు.

ఎస్వీ సునీల్, పవన్‌ రాజ్‌భర్, కార్తీ సెల్వమ్‌ చెరో 2 గోల్స్‌ నమోదు చేయగా... ఉత్తమ్‌ సింగ్, నీలమ్‌ సంజీప్‌ ఒక్కో గోల్‌ చేశారు.

భారత్‌కు 21 పెనాల్టీ కార్నర్‌లు లభించగా, అందులో జట్టు ఎనిమిదింటిని గోల్స్‌గా మలచగలిగింది.

‘సూపర్‌ 4’ దశకు చేరడం ద్వారా జపాన్, కొరియా, మలేసియా వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించాయి.

ఆతిథ్య హోదాలో భారత్‌ ముందే అర్హత సాధించింది.