పురాతన కాలంలో యాపిల్‌ ప్రస్తుతం ఉన్నట్లు ఉండేది కాదట! చాలా చిన్నగా, చేదుగా ఉండేదని కెనడా పరిశోధకులు తేల్చారు.

వేలాది సంవత్సరాల కాలంలో రకరకాల పద్ధతుల ద్వారా ఇప్పుడున్న ఆకారం, రంగు, రుచికి తీసుకొచ్చారు.

యాపిల్‌ పుట్టినిల్లు ఇప్పటి కజకిస్తాన్‌లోని తియాన్‌షెన్‌ కొండలు.

ఆ దేశంలోని అతి పెద్ద నగరమైన అల్మాటీ పేరు యాపిల్‌ నుంచే పుట్టింది. అల్మాటౌ అంటే కజక్‌ భాషలో యాపిల్‌ కొండ అని అర్థం.

మానవులు గత 5,000 సంవత్సరాలుగా యాపిల్‌ను సాగు చేస్తున్నారు.

పురాతన కాలంలో యాపిల్‌ విత్తనాలను సిల్క్‌ రూట్‌ గుండా ఆసియా అంతటికీ రవాణా చేశారు. తర్వాత ఇవి ప్రపంచంలోని అన్ని ప్రాంతాలకూ చేరాయి.

ఈ అటవీ జాతి యాపిల్స్‌తో పోలిస్తే మనుషులు సాగు చేసే పండ్లు 3.6 రెట్లు అధిక బరువు, 43 శాతం తక్కువ అమ్లత్వాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధకులు కనిపెట్టారు.

చేదుకు కారణమయ్యే ఫినోలిక్‌ కాంపౌండ్‌ 68 శాతం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అందువల్లే చేదు చాలావరకు తగ్గిపోయినట్లు పేర్కొన్నారు.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో గత 200 ఏళ్లుగా యాపిల్స్‌లో కొత్త రకాలను సృష్టించడంలో వేగం పెరిగింది.