రుచికరమైన సగ్గుబియ్యం వడలు

కావలసినవి: సగ్గుబియ్యం – వందగ్రాములు

బంగాళాదుంప – 4 మీడియం సైజువి

వేరు శనగపప్పు – ఒక టేబుల్‌ స్పూన్‌

జీలకర్ర – టీ స్పూన్‌

పచ్చి మిర్చి– 2 (సన్నగా తరగాలి)

అల్లం తరుగు – టీ స్పూన్‌

నిమ్మరసం – 2 టీ స్పూన్‌లు

కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్‌లు

ఉప్పు – టీ స్పూన్‌ లేదా రుచికి తగినంత

నూనె – పావు కేజీ

తయారీ: ∙సగ్గుబియ్యాన్ని కడిగి రెండు గంటల సేపు నానబెట్టాలి (లావు సగ్గుబియ్యం అయితే ఐదు గంటల సేపు నానాలి)

సగ్గుబియ్యం గోరుతో గుచ్చి చూస్తే లోపల గట్టిదనం లేకుండా మెత్తగా ఉండాలి

ఈ లోపు బంగాళాదుంపలను కడిగి ఉడికించాలి.

ఒక బాణలిలో వేరుశనగపప్పును వేయించాలి. చల్లారిన తర్వాత మిక్సీలో కొంచెం పలుకుగా గ్రైండ్‌ చేసుకోవాలి

బంగాళాదుంప లు చల్లారిన తర్వాత చిదిమి వెడల్పు పాత్రలో వేసుకోవాలి.

అందులో ఉప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, జీలకర్ర, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, వేరుశనగ పప్పు పొడి వేయాలి.

సగ్గుబియ్యాన్ని వడపోసి నీరు పోయిన తర్వాత చేత్తో మెదిపి బంగాళాదుంప మిశ్రమంలో వేసి కలపాలి. సగ్గుబియ్యం వడల పిండి రెడీ.

బాణలిలో నూనె వేడి చేసి పిండిని పెద్ద ఉల్లిపాయంత తీసుకుని అరచేతిలో వేసి వత్తి నూనెలో వేయాలి.

రెండువైపులా ఎర్రగా కాలిన తరవాత టొమాటో కెచప్‌ లేదా పుదీన పచ్చడితో తింటే చాలా రుచిగా ఉంటాయి.

గమనిక: పిండిని చేతిలో వేసి వత్తినప్పుడు జారిపోతున్నా, నూనెలో వేసిన తర్వాత విడిపోతున్నా వదులుగా ఉందని అర్థం.

అలాంటప్పుడు తగినంత ఉప్మారవ్వ కలిపి మిశ్రమాన్ని వడ చేయడానికి తగినట్లుగా గట్టిగా చేసుకోవాలి.