రెండు పూటలా స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి.

చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం, లేదా తడి వస్త్రంతో శరీరాన్ని తుడవడం తప్పనిసరి.

వదులుగా ఉండే పల్చని కాటన్‌ వస్త్రాలు వేసుకోవాలి.

స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మేలు.

ఒంటినిండా చెమటకాయలు వచ్చినప్పుడు గంధం ముద్దని పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి.

ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసినా కూడా సమస్య అదుపులోకి వస్తుంది.

చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా చెమట కాయలపై రాసినా మంచిదే.

కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది.

తాటి ముంజెలలోని నీటిని చెమట కాయలపై రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచేయాలి.

పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ... వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి.