మీరు ఎప్పుడైనా రైలు వెనుక బోగీపై ఎక్స్‌ అనే గుర్తు ఉండటం గమనించారా? దాని అర్థం ఏమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించారా?

రైలు బోగీ చివర ఎక్స్‌ కనిపిస్తే అదే ఆ రైలుకున్న చివరి బోగీ అని అర్థం.

ఈ ఎక్స్‌ మాత్రమే కాకుండా రైలు వెనుక భాగంలో ఎల్‌వీ(lv) అక్షరాలు రాసిన బోర్డు ఉంటుంది. అంటే అదే లాస్ట్‌ వెహికల్‌ అని అర్థం. దీనిని రైల్వే గార్డు బోగీకి తగిలిస్తారు.

ప్లాట్‌ఫామ్‌పై రైలు నిల్చున్నప్పుడు ఇతర రైళ్ల లోకో పైలట్లు ఈ ‘ఎల్‌వీ’ బోర్డును గమనిస్తారు.

బాగా దూరం నుంచి ఎక్స్‌ గుర్తు స్పష్టంగా కనిపించడంతో ఇతర రైళ్లు వెనుక నుంచి ఢీకొనే ప్రమాదం ఉండదు. ఇది మాత్రమే కాదు ఎక్స్‌ కనిపించిందటే అర్థం ఆ రైలు బోగీలన్నీ కలిసే ఉన్నాయని.

ఏదైనా లోపం వల్ల బోగీలు ఊడిపోయి ఎక్కడో ఒక చోట ఆగిపోతాయి. కానీ.. రైలు ఇంజిన్‌తో అనుసంధానమైన ముందు బోగీలన్నీ పరుగు తీస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో వాటి వెనుక ఎక్స్‌ గుర్తు కనిపించదు.

వివిధ స్టేషన్ల గుండా రైలు దాటుతున్న సమయంలో స్టేషన్‌మాస్టర్లు తప్పకుండా వెనుక బోగీకి ఎక్స్‌ ఉందో లేదో చూస్తారు. ఏదైనా తేడా కనిపిస్తే వెంటనే ముందు స్టేషన్లకు, వెనక స్టేషన్లకు సమాచారం ఇస్తారు.

ఏబీసీడీలు 26 ఉంటే రైల్వే అధికారులు ‘X’ మాత్రమే ఎందుకు పెట్టారు? అనే అనుమానం మీకు రావొచ్చు. ఆ ‘X’ అనేది చిహ్నం మాత్రమే. అక్షరం కాదు.

కానీ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆంగ్ల వర్ణమాలలోని ఇతర అక్షరాలతో పోలిస్తే ‘X’ చాలా దూరం నుంచి సులభంగా కనిపిస్తుంది. అందుకే దీన్ని ఎంచుకున్నారు.