రాష్ట్రంలో రోడ్లను ఉపయోగించడానికి ప్రతి వాహనదారుడు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి రోడ్‌ ట్యాక్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని రోడ్ ట్యాక్స్‌ అనరు. టోల్‌ ట్యాక్స్‌ అంటారు.

వాహనం బరువు, తయారైన సంవత్సరం, సీటింగ్‌ కెపాసిటీ, ఇంజిన్‌ రకాలను బట్టి ఈ ట్యాక్స్‌ మొత్తాన్ని నిర్ణయిస్తారు.

రవాణా సౌకర్యాలను మెరుగు పరిచేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) పని చేస్తుంది.

ప్రైవేటు కాంట్రాక్టు సంస్థల సహాయంతో వివిధ రాష్ట్రాల మధ్య హైవేలు, ఎక్స్‌ప్రెస్‌ హైవేలు నిర్మిస్తుంది. రోడ్డు వేయడానికి చేసిన ఖర్చును టోల్‌ రూపంలో వసూలు చేసి కాంట్రాక్టర్లకు చెల్లిస్తుంది.

రోడ్డు వేయడానికి ఖర్చు చేసిన మొత్తం వసూలైన తరువాత టోల్‌ ఫీజును 40 శాతానికి తగ్గించాలనే నిబంధన ఉంది

రెండు టోల్‌ బూత్‌ల మధ్య సాధారణంగా 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతకంటే తక్కువ దూరంలోనూ ఉండే అవకాశముంది.

ఆ దూరాన్ని బట్టి ట్యాక్స్‌ వసూలు చేస్తారు. ప్రతి ఏటా ఏప్రిల్‌ 1న అవసరాన్ని బట్టి టోల్‌ ధరలను పెంచుతున్నారు.

నాణ్యమైన, గుంతలు లేని రహదారిని వినియోగించి ప్రయాణం సాఫీగా చేస్తున్నందుకు చెల్లించే రుసుము.

రోడ్లను అభివృద్ధి చేసేందుకు నిధులు సమకూర్చుకోవడం కోసం టోల్‌ వసూలు చేస్తారు. కేవలం రోడ్లు వేయడమే కాదు.. వాటి మరమ్మతులు, నిర్వహణ కోసం కూడా టోల్‌ నిధులను ఖర్చు చేస్తారు.

ఏళ్ల తరబడి టోల్‌ వసూలు చేయడం వల్ల ఆ రోడ్డు వేయడానికి చేసిన ఖర్చు వసూలవుతుంది.

ఈ మొత్తాన్ని ఎన్‌హెచ్‌ఏఐ తీసుకొని రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు, ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు చెల్లింపులు చేస్తుంది.

టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ను ప్రవేశపెట్టారు. నగదు రహిత లావాదేవీలు చేసేందుకు ఫాస్టాగ్‌ ఉపయోగపడుతుంది.

టోల్ ప్లాజాల దగ్గర 100 మీటర్ల కన్నా ఎక్కువ క్యూ ఉన్నట్టైతే వాహనదారులు టోల్ ఫీజు చెల్లించకుండా ముందుకు వెళ్లిపోవచ్చు.

టోల్ ప్లాజా నుంచి 100 మీటర్ల దూరంలో ఎల్లో లైన్ ఉంటుంది. ఆ ఎల్లో లైన్ దాటి వాహనాలు క్యూలో ఉంటే టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, న్యాయమూర్తులు, ఆర్మీ, పోలీసు అధికారుల వాహనాలకు మినహాయింపు ఉంటుంది.

అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు, అంతిమయాత్ర వాహనాల నుంచి టోల్‌ తీసుకోరు.

టోల్‌ ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలో ఆర్టీవో ఆఫీసులో రిజిస్టర్‌ అయిన వాహనాలకు స్థానికులు ట్యాక్స్‌ మినహాయింపు పొందవచ్చు.