శీతాకాలంలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పొడి చర్మం, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఈ కాలంలో జుట్టు, చర్మానికి సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తప్పక తీసుకోవాలి. విటమిన్‌ ‘ఇ’ చర్మ సౌందర్యానికి ఎంతో మేలు చేస్తుంది.

సహజ పద్ధతుల్లో శరీరానికి ఈ విటమిన్‌ అందాలంటే.. విటమిన్‌ ‘ఇ’ అధికంగా ఉండే ఆహారాన్నితీసుకోవడం ఉత్తమం.

విటమిన్‌ ‘ఇ’ ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, చర్మ సమస్యల నుంచి రక్షణ కల్పించే లక్షణాలు కలిగి ఉంటుంది.

అంతేకాకుండా వృద్ధాప్యఛాయలు, ఎండవల్ల కమిలిన చర్మానికి చికిత్సనందిస్తుంది.

రాత్రి అంతా నానబెట్టిన ఐదు బాదం పప్పులను ఉదయాన్నే పరగడుపున తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

ఉదయం పూట అల్పాహారంగా ఆకు పచ్చ కూరగాయలతో ఉడికించిన గుడ్డును తీసుకున్నా మంచిదే.

మెత్తగా క్రీమీగా ఉండే అవకాడో పండు స్మాష్‌ చేసి టోస్ట్‌ లేదా గుడ్డు, మాంసం, కూరగాయలు దేనితోనైనా స్టఫ్‌గా తినొచ్చు.

పొద్దుతిరుగుడు విత్తనాల్లో విటమిన్ ‘ఇ ’ పుష్కలంగా ఉంటుంది. కాల్చిన పొద్దుతిరుగుడు గింజలను మార్నింగ్‌ కాఫీతో స్నాక్స్‌లా తినొచ్చు.

బ్రెడ్‌పై వేరుశెనగ వెన్న పూసి ఉదయం అల్పాహారంగా తినొచ్చు. ఉప్మా, పోహాలలో వేరుశెనగను జోడించి తిన్నా పోషకాలు అందుతాయి.