చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి.

ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది.

దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు.

ఆహారంలో మార్పులు, తరచుగా ప్రయాణాలు, నీటి మార్పు వంటివి ఇప్పుడు అందరి జీవితాల్లోకి వచ్చాయి.

ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి.

ఇతరుల దువ్వెనలను, హెయిర్‌ బ్రష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు.

వారానికొకసారి గోరువెచ్చని కొబ్బరినూనెతో తలపై సున్నితంగా మర్దన చేసి, కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.

తలస్నానం చేసే నీళ్ళు పొగలు కక్కేంత వేడిగా లేదా వణుకు పుట్టించేంత చల్లగా ఉండకూడదు. గోరువెచ్చని నీరు చాలా మంచిది.

గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్‌ ఆయిల్స్‌ను, షాంపూలను ఇష్టం వచ్చినట్లు వాడినా చుండ్రు వస్తుంది.

మాసిన తలగడలను వాడటం, దుమ్ము, ధూళి పడే ప్రదేశంలో పని చేయడం, పోషకాహారలోపం వల్ల కూడా వస్తుంది.

మానసిక ఆందోళన, కొన్ని రకాల మందులను వాడటం చుండ్రుకు దారి తీసే కారణాలలో ప్రధానమైనవి

చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి.

పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు.