వార్నర్‌ గార్డ్‌ ఛేంజ్‌ చేసి మరీ రెచ్చిపోయాడు..

బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా ఏడాదిపాటు అంతర్జాతీయ నిషేధం గురైన ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌.. మరో రెండు నెలల్లో నిషేధం పూర్తి చేసుకోబోతున్నాడు. మార్చి నెల చివరి వారంతో అతనిపై విధించిన నిషేధం పూర్తి కావొస్తుంది. ఈ క్రమంలోనే విదేశీ లీగ్‌లో పాల్గొంటూ తన ఫామ్‌ను ఉనికిపుచ్చుకునే పనిలో ఉన్నాడు డేవిడ్‌ వార్నర్‌. ఇప్పటికే కెనడా లీగ్‌ ఆడిన వార్నర్‌.. తాజాగా బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌(బీపీఎల్‌)లో ఆడుతున్నాడు. బీపీఎల్‌లో సిల్హెట్‌ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా వ్యహరిస్తున్న వార్నర్‌ తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. రంగాపూర్‌ రైడర్స్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో వార్నర్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు చేశాడు. అయితే ఇందులో కొన్ని బంతులు ఆడటానికి తన బ్యాటింగ్‌ గార్డ్‌ను మార‍్చుకుని సాధించడం విశేషం.స్వతహాగా ఎడమచేతి వాట బ్యాట్స్‌మన్‌ అయిన వార్నర్‌..  గేల్‌ వేసిన 19 ఓవర్‌ నాల్గో బంతికి ఉన్నపళంగా గార్డ్‌ మార్చుకున్నాడు. అంతకుముందు బాల్‌ను హిట్‌ చేద్దామని ప్రయత్నించిన వార్నర్‌ విఫలం కావడంతో కుడి చేతి వాటం బ్యాటింగ్‌ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫీల్డ్‌ అంపైర్‌కు తెలిపిన వార్నర్‌.. రైట్‌ హ్యాండ్‌తో ఆడిన మొదటి బంతిని సిక్స్‌గా కొట్టాడు. ఆ తర్వాత వరుస రెండు బంతుల్ని రెండు ఫోర్లు కొట్టి మరీ ఆకట్టుకున్నాడు.  ఈ మ్యాచ్‌లో 33 బంతుల్లో 47 పరుగుల్ని లెఫ్ట్‌ హ్యాండర్‌గా సాధించగా, 3 బంతుల్లో 14 పరుగుల్ని రైట్‌ హ్యాండర్‌గా సాధించాడు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top