ట్రంప్‌ ఆరోగ్యంపై ఆందోళన..

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆరోగ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యూఎస్‌ సైనిక అకాడమీలో శనివారం ట్రంప్‌ ప్రసంగిస్తున్న సమయంలో కుడిచేతితో మంచినీటి గ్లాస్‌ను అందుకునేందుకు ట్రంప్‌ ఇబ్బంది పడిన వీడియో వైరల్‌గా మారింది. గ్లాస్‌ను పైకెత్తి నీరు తాగేందుకు తన ఎడమ చేతి సాయం తీసుకోవాల్సిన పరిస్థితి ఆయనకు ఎదురైంది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ట్రంప్‌ ఆరోగ్యంపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ట్రంప్‌ ఇటీవల ఆర్మీ కాలేజ్‌లో గ్రాడ్యుయేట్లను ఉద్దేశించి ప్రసంగించి మెట్లు దిగి వచ్చే సందర్భంలోనూ కుదురుగా ఉండలేకపోయారు. రానున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల పర్యటనలతో ఆయన అలసటకు గురయ్యారని కొందరు చెబుతుండగా మరికొందరు మాత్రం ఆయన ఆరోగ్యం తీవ్రంగా గాడితప్పిందనే సంకేతాలు ఇవని పేర్కొంటున్నారు.

ఈ ఏడాది ట్రంప్‌ ఆరోగ్యంపై వార్షిక నివేదిక వెలువడకపోవడాన్ని వారు ఉదహరిస్తున్నారు. కాగా ట్రంప్‌కు బ్రైన్‌ స్కాన్‌ తీయాల్సిన అవసరం ఉందని ఈ లక్షణాలు వెల్లడిస్తున్నాయని ప్రముఖ సైకియాట్రిస్ట్‌ డాక్టర్‌ బెండీ లీ ట్వీట్‌ చేశారు. మరోవైపు తాను పూర్తి ఆరోగ్యంతో తన వయసుకు తగిన సౌష్టవంతో ఉన్నానని ట్రంప్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్తగా మలేరియా చికిత్సకు వాడే హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ను ఆయన రెండు వారాల పాటు వాడటంతో సైడ్‌ఎఫెక్ట్స్‌ను పసిగట్టేందుకు వైట్‌హౌస్‌ వైద్య బృందం ఆయనకు ఈసీజీ సహా తరచూ వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top