బడుగుజీవికి ‘బండె’డు కష్టాలు!

ఇండోర్‌: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర  ప్రభుత్వం హడావుడిగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో వలసజీవులు అష్టకష్టాలు పడుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి తిండి దొరక్క, ఉండటానికి గూడుకరువై లక్షలాది మంది బడుగు జీవులు నగరాల నుంచి కాలినడన గ్రామాల బాట పడుతున్నారు. మూటముల్లె సద్దుకుని పిల్లాపాపలతో వందల కిలోమీటర్లు నడుస్తూ నరకం చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా వలసజీవుల వెతలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వలస కార్మికులకు చెందిన హృదయ విదారక ఘటన ఒకటి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ జిల్లాలో వెలుగు చూసింది. 

నగరం నుంచి తన కుటుంబాన్ని సొంత ఊరికి చేర్చేందుకు వలస కార్మికుడు కాడెద్దులా మారి బండి లాగుతున్న దృశ్యం చూపరులను విస్మయానికి గురిచేసింది. రాహుల్‌ అనే వ్యక్తి ఇండోర్‌ జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌లో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. లాక్‌డౌన్‌తో ఉపాధి లేకపోవడంతో తన రెండెడ్ల బండిపై 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న సొంతూరు మండ్ల నయాత గ్రామానికి వెళ్లిపోవాలనుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో ఒక అయిన కాడికి ఒక ఎద్దును అమ్మేశాడు. భార్యను, తమ్ముడిని బండిపై కూర్చొబెట్టి మరో ఎద్దుకు జతగా తానే కాడిని ఎత్తుకుని పయనం మొదలుపెట్టాడు.

ఆగ్రా-ముంబై జాతీయ రహదారిపై బండిని లాగుతూ మీడియా కంటపడ్డాడు. ప్రతినిధులు అతడిని పలకరించగా తన కష్టాలను కలబోసుకున్నాడు. ‘సొంతూరికి వెళ్లాలని నా ఎద్దును చాలా తక్కువ ధరకు అమ్మేశాను. మామూలు రోజుల్లో అమ్మితే రూ. 15 వేలు వచ్చేవి. కానీ నేను 5 వేలకే నా ఎద్దును విక్రయించాన’ని రాహుల్‌ తెలిపాడు. తన తండ్రి, సోదరి కాలినడకన ముందే వెళ్లిపోయారని చెప్పాడు. రాహుల్‌ బండి లాగుతున్న వీడియో వైరల్‌ కావడంతో మధ్యప్రదేశ్‌ మంత్రి తులసీ సిలావత్‌ స్పందించారు. రాహుల్‌ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇండోర్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top