ఆసుపత్రిలో అందరి ముందే ప్రసవం.. రక్తంలో..

పురిటినొప్పులతో ఆసుపత్రి వెళ్లిన మహిళకు నరకం చూపించారు అక్కడి వైద్యులు. కనీసం ఆమెకు ఓ బెడ్‌ కూడా కేటాయించకపోవటంతో ఆసుపత్రి కారిడార్‌లో అందరి ముందు శిశువుకు జన్మనిచ్చింది. ఒకవైపు ప్రసవ వేదన, మరోవైపు మానసిక క్షోభను అనుభవించిందా మహిళ. ఈ దయనీయ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో జరిగింది. ఓ నిండు గర్భిణీ ఆదివారం ఫరూఖాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. అక్కడి వైద్యులు, సిబ్బంది బెడ్స్‌ ఖాళీగా లేవంటూ నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పురిటి నొప్పులు తీవ్రతరమైన మహిళ ఆసుపత్రి కారిడార్‌లోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె బంధువు అప్పుడే పుట్టిన శిశువును చేతిలోకి తీసుకుని బట్టలో చుట్టింది.

కాగా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను ఏ ఒక్కరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ దృశ్యాన్ని అక్కడే ఉన్న ఓ వ్యక్తి సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి... స్థానిక జర్నలిస్టులకు సమాచారమివ్వడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యంతో ఆమెకు జరగరానిది ఏదైనా జరిగి ఉంటే ఎంత ఘోరం జరిగి ఉండేదని ఉన్నతాధికారులు ఆసుపత్రి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సుమోటో కింద కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలు జరగడం మొదటిసారి కాదు. ఈ ఏడాదిలోనే ఓ మహిళ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి నర్సులు బయటికి పంపించేయడంతో రోడ్డు మీదే ప్రసవించింది.  2017లో కూడా ఆక్సిజన్‌ అందక ఒకే నెలలో 49 మంది శిశువులు మరణించిన విషయం తెలిసిందే.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top