మాంసం తినడం మంచిదేనట!

సాక్షి, న్యూఢిల్లీ : ఆవు, పంది, గొర్రె మాంసం రోజూ తినడం మంచిది కాదని, దాని వల్ల ప్రాణాంతకమైన గుండె జబ్బులు, క్సాన్సర్లే కాకుండా మధుమేహం–2 జబ్బు వస్తోందంటూ పలు ఆరోగ్య సంస్థలు ఇంతకాలం చేస్తూ వచ్చిన సూచనలు తప్పని కెనడా, పోలాండ్, స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. కెనడాలోని డలౌజీ, మ్యాక్‌మాస్టర్‌ యూనివర్శిటీలు, స్పెయిన్, పోలాండ్‌లోని కొక్రేన్‌ రీసర్చ్‌ సెంటర్లకు చెందిన 14 మంది  పరిశోధకుల బృందం గతంలో 40 లక్షల మంది ప్రజల ఆరోగ్యాన్ని సమీక్షించిన 61 అధ్యయనాలను క్షుణ్నంగా పరిశీలించి ఈ విషయాన్ని తేల్చింది. మోతాదుకు మించి మాంసం తినడం వల్ల జబ్బులు, ముఖ్యంగా ఈ మూడు జబ్బులు వస్తాయనడానికి వారు ఎలాంటి ఆధారాలను సేకరించలేక పోయారని పరిశోధకుల బృందం అభిప్రాయపడింది.

గత అధ్యయనాలను దృష్టిలో పెట్టుకొని ఒకరు రోజుకు 70 గ్రాములకు మించి మాంసం తినరాదంటూ బ్రిటన్‌ జాతీయ ఆరోగ్య పథకం కింద జారీ చేసిన మార్గదర్శకాలు తొందరపాటు చర్యేనని ఈ పరిశోధకుల బృందం పేర్కొంది. మధ్య వయస్కులు కూడా మరీ ఎక్కువ కాకుండా ఇంతకన్నా ఎక్కువ మాంసమే తినవచ్చని తాజా అధ్యయనంలో పరిశోధకులు అభిప్రాయపడ్డారు. తమంతట తాము డైట్‌ మార్చుకోవాలనుకుని మాంసహారాన్ని తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చుగానీ, అనారోగ్యానికి, మాంసహారానికి సంబంధం ఉన్నట్లు పాత అధ్యయనాలు ఏవీ కూడా సహేతుకంగా రుజువు చేయలేక పోయయని కూడా తాజా అధ్యయనం పేర్కొంది. శుద్ధి చేసిన మాంసం తినడం వల్ల క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో తాజా అధ్యయనంపై దుమారం రేగే అవకాశం ఎక్కువగా ఉంది.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వీడియోలు

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

World Of Love    

Read also in:
Back to Top