బీజేపీకి షాక్‌.. రిపోర్టర్లకు లంచం ఇవ్వబోయారంటూ

సార్వత్రిక ఎన్నికల జోరుగా సాగుతున్న తరుణంలో బీజేపీకి భారీ షాక్‌ తగిలింది. లడఖ్‌ ఎ‍న్నికల్లో బీజేపీకి అనుకూలంగా వార్తలు ప్రచారం చేయాలంటూ.. ఆ పార్టీ నాయకులు తమకు లంచం ఇవ్వడానికి ప్రయత్నించారని లేహ్‌ రిపోర్టర్లు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎన్డీటీవీ ఈ వీడియోను ప్రసారం చేసింది.ఈ విషయం గురించి మహిళా జర్నలిస్ట్‌ రించెన్‌ ఆంగ్మో మాట్లాడుతూ.. 'ఈనెల 2న ఓ హోటల్‌లో బీజేపీ నాయకులు విక్రం రంధావా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌ రైనా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరయ్యాం. కార్యక్రమం ముగిశాక మేము బయటకు వెళ్తున్న సమయంలో బీజేపీ నాయకులు మా దగ్గరకు వచ్చారు. నలుగురు రిపోర్టర్లకు ఎన్వలప్‌లను ఇచ్చారు. అనుమానం వచ్చిన రిపోర్టర్లు వాటిని తెరిచి చూడగా దానిలో రూ. 500 నోట్లు ఉన్నాయి. బీజేపీ చర్యలకు మేం షాక్‌ అయ్యాం. ఇలా చేయడం తప్పని చెప్పాం’ అన్నారు.కానీ విక్రం, రవీందర్‌లు ‘ఇది కేవలం అభిమానంతో ఇస్తున్నాం. ఈ రోజుల్లో ఇదంతా సాధారణమేనని, ఇలాంటివి ప్రతిచోటా జరుగుతాయని మమ్మల్ని కన్విన్స్‌ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ, వెంటనే మా రిపోర్టర్లు ఆ ఎన్వలప్‌లను అక్కడే టేబుల్‌పై పెట్టి బయటకు వచ్చార’ని రించెన్‌ ఆంగ్మో తెలిపారు. అయితే ఈ ఆరోపణలను ఓ సీనియర్‌ బీజేపీ నాయకుడు ఖండించారు. తమ నాయకులు రిపోర్టర్లకు ఇచ్చింది ఎన్వలప్‌లు కాదని.. ఇన్విటేషన్‌ కార్డని పేర్కొన్నారు. త్వరలో రాష్ట్రంలో నిర్మలా సీతారామన్‌ పర్యటించబోతున్నారని.. దాన్ని కవర్‌ చేయడానికి రిపోర్టర్లను ఆహ్వానిస్తూ ఇన్విటేషన్‌ ఇచ్చామని ఆయన తెలిపారు. జర్నలిస్ట్‌లకు మేం చాలా గౌరవం ఇస్తాం. బీజేపీ ఇలాంటి పనుల ఎన్నటికి చేయదని ఆయన స్పష్టం చేశారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top