ఎలక్షన్ స్టంట్

విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం కడప ఉక్కు కర్మాగారం, విశాఖపట్నం మెట్రో రైలు, దుగరాజపట్నం పోర్టు వంటి ప్రాజెక్టులను తామే సొంతంగా చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి మూడు లేఖలు రాయనున్నట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు వెల్లడించారు. కేబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సచివాలయంలో ఆయన మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర విభజన ఒప్పందంలో భాగంగా కడపలో స్టీల్‌ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ కేంద్రానికి లేఖ రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రం ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, తక్షణమే వాటన్నింటినీ అమలు చేయాలని కోరుతూ ప్రధానికి మరో లేఖ రాయనున్నట్లు తెలిపారు. తిత్లీ తుపాన్‌ విషయంలో కేంద్రం వైఖరిపై కేంద్ర హోంమంత్రికి ప్రత్యేకంగా మరో లేఖ రాయాలని మంత్రిమండలి నిర్ణయించినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు భాగస్వామిగా ఉండి విభజన చట్టంలోని హామీలపై ఏనాడూ నోరుమెదపని టీడీపీ సర్కారు ఇపుడు ఎన్నికల ముంగిట ఏదో చేసేయబోతున్నట్లు హడావిడి చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ఏడాదిలో ఇదేదో కొత్త గిమ్మిక్కు మాదిరిగా ఉందని జనం చర్చించుకుంటున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top