కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో ఒక్కొక్క రాష్టం ఒక్కొక్క విధంగా అర్హత మార్కులు పెట్టాయని, ఇది సబబుగా లేదని ఓసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి రామకృష్ణారెడ్డి, ఓసీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కందనూరు వెంకట సుబ్బారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కడపలోని నాగార్జున మహిళా డిగ్రీ కాలేజీలో వారు విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో టెట్‌లో ఓసీలకు 90 మార్కులు(60శాతం), బీసీలకు 75 మార్కులు(50 శాతం), ఎస్సీ/ఎస్టీలకు 60 మార్కులు(40 శాతం ) అర్హతగా నిబంధనలు పెట్టి ఓసీలను అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం మొత్తం మీద ఒకే విధంగా అన్ని వర్గాలకు సమానంగా అర్హత మార్కులు పెట్టాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా పెట్టి ఓసీలను సర్వ నాశనం చేసారని అన్నారు. ఈ విధానం తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోమని అన్నారు. టెట్‌లో పెడితే అందరికి సమానంగా అర్హత మార్కులు పెట్టాలి లేదా ఓసీలకు 15 శాతం అర్హత మార్కులు తగ్గించాలని డిమాండ్ చేశారు.


