● తమిళనాడు వాసి అరెస్ట్
● రూ.14.50 లక్షల బంగారు,
వెండి నగలు స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం : అతను బధిరుడు కాదు.. అయితే మూగ, చెవిటి వాడిలా నమ్మించి భారీ దొంగతనానికి పాల్పడ్డాడు. ప్రొద్దుటూరులోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన తమిళనాడు వాసిని ప్రొద్దుటూరు వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను సోమవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ మీడియాకు తెలిపారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా ఉదయరాజు పాలెం గ్రామానికి చెందిన శివకుమార్ మునియప్పన్ కూలి పని చేస్తుంటాడు. రోజూ కష్టపడ్డా డబ్బులు మిగలడం లేదని భావించిన అతను మూగవాడి ముసుగులో చిన్న చిన్న దొంగతనాలు చేయాలని భావించాడు. అయితే స్థానికంగా తిరిగితే ఎవరైనా గుర్తు పడతారని భావించి, ప్రొద్దుటూరుకు వచ్చాడు. తమిళనాడు నుంచి రైలులో బయలుదేరి ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఎర్రగుంట్లలో దిగాడు. అక్కడి నుంచి నేరుగా ప్రొద్దుటూరుకు వచ్చాడు. తన వద్ద ఒక చీటి పెట్టుకున్నాడు. ఒక డాక్టర్ సర్టిఫైడ్ చేసినట్లుగా ఉన్న ఆ చీటిలో ‘ఈ వ్యక్తికి చెవుడు, మూగ. ఇతనికి తల్లిదండ్రులు బంధువులు ఎవరూ లేరు. ఈ చీటి చూసిన వారు తగిన ఆర్ధిక సాయం చేయగలరు’ అని రాసి ఉంది. అతను బంగారు అంగళ్లలోని ఇళ్లకు తిరుగుతూ ఆ చీటీని చూపించేవాడు. చీటి చూసిన కొందరు మానవతా హృదయంతో ఆర్థిక సాయం చేసేవారు. ఇలా ఎవరూ చూడని సమయంలో ఇంట్లోని మొబైల్ ఫోన్లు, వాచీలు, హ్యాండ్ బ్యాగ్‌లు దొంగలించేవాడు. ఈ క్రమంలో శంకరయ్య గారి వీధి గుండా వెళ్తున్న అతను గంగనపల్లి శివాజీరావు ఇంట్లోకి వెళ్లాడు. శివాజీరావు భార్య అస్వస్థతతో పడుకొని ఉండగా నేరుగా పూజ గదిలోకి వెళ్లి బంగారుతో అల్లిన రుద్రాక్ష మాల, బంగారు చైన్, బంగారు, వెండి ఉంగరాలను దొంగలించి పారిపోయాడు. శివాజీరావు ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజీ, నాట్‌గ్రిడ్ టెక్నాలజీ ద్వారా పోలీసులు నిందితుడి ఆచూకీ కనుగొన్నారు. ఈ క్రమంలో అతన్ని వాసవి సర్కిల్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి రూ,14.50 లక్షలు విలువైన బంగారు, వెండి నగలతోపాటు హెచ్‌పీ ల్యాప్‌టాప్, ట్యాబ్, 5 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు.
పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసలు
ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరచి నిందితుడ్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి పూర్తి స్థాయిలో చోరీ సొత్తును రికవరీ చేయడంలో విశేష కృషి చేసిన వన్‌టౌన్ సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాసులు, మధుసూదన్‌రెడ్డి, ఏఎస్‌ఐ శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కే బాషా, వై నరసింహనాయుడు, సాయికిశోర్‌లను ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు.


