మైదుకూరు : మైదుకూరు పట్టణ పరిధిలోని శ్రీనగరంలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామంలోని గోశెట్టి చిన్నరామ తులసయ్య అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన దొంగ ఇంట్లో ఉండగానే.. ఇంటి యజమాని రామ తులసయ్య రావడంతో వెనుక వైపున తలుపు తీసుకొని పారితోతుండగా గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రామతులయ్యకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ వివాహాలు అయ్యాయి. కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు. కొన్నేళ్ల కిందట ఆయన భార్య రామలక్షుమ్మ మృతి చెందడంతో రామతులసయ్య ఒంటరిగా ఉంటున్నారు. ప్రతి రోజూ మైదుకూరుకు వెళ్లి మధ్యాహ్నం వేళ పట్టణంలో నివాసం ఉంటున్న ఆయన కుమార్తె ఇంటి నుంచి భోజనాన్ని తీసుకుని ఇంటికి వచ్చేవాడు. సోమవారం ఇంటికి తాళం వేసి యథావిధిగా రామతులసయ్య మైదుకూరుకు వెళ్లాడు. రోడ్డుపై ఇల్లు ఉండటం, ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇదే అదనుగా భావించిన దొంగ తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డాడు. ఓ గదిలో ఉన్న మూడు బీరువాల తలుపులను అక్కడ ఉన్న స్క్రూ డ్రైవర్‌తో తెరిచాడు. బీరువాల్లో విలువైన వస్తువుల కోసం వెతుకుతుండగానే రామతులసయ్య తలుపు తట్టాడు. యజమాని వచ్చినట్టు భావించిన అగంతకుడు వెనుక వైపునున్న తలుపును తెరిచి గోడ దూకి పరుగెత్తాడు. గ్రామస్తులు గమనించి వెంబడించి పట్టుకున్నారు. స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. దొంగ జేబుల్లో వెతకగా రామతులసయ్య ఇంట్లో బీరువా నుంచి తీసిన రూ.800 నగదుతోపాటు కొంత బంగారం ఉన్నట్లు గుర్తించారు. తన ఇంట్లో బంగారు ఆభరణాలేవీ పెట్టలేదని, కేవలం కొంత నగదు మాత్రమే దొంగలించాడని ఈ సందర్భంగా రామతులసయ్య తెలిపారు. పోలీసులకు సమాచారం అందించి నగదు, బంగారాన్ని, దొంగను గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. రామతులసయ్య ఇంట్లో చోరీ చేసే ముందు సదరు దొంగ దువ్వూరు మండలంలో చోరీకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ విషయమై అర్బన్ ఎస్‌ఐ కత్తి వెంకటరమణను వివరణ కోరగా దొంగను నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన జగన్నాథం కిరణ్‌గా గుర్తించామని, విచారణ చేస్తున్నామని తెలిపారు.
దొంగను పట్టుకొని పోలీసులకు
అప్పగించిన గ్రామస్తులు


