కోటి సంతకాలకు అద్భుత స్పందన
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని చంద్రబాబు సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని వారు బలంగా కోరుకుంటున్నారు. ఈ మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో అద్భుత స్పందన లభిస్తోంది. జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఉండగా ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 60వేల సంతకాలు సేకరిచాలని పార్టీ నిర్దేశించింది. అన్ని చోట్లా లక్షలాదిగా..లక్ష్యానికి మించి ప్రజలు సంతకాలు చేశారు. పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో లక్ష చొప్పున సంతకాలు సేకరించారు. కడపనియోజకవర్గంలో 70వేలు, మైదుకూరు నియోజకవర్గంలో 50వేలు, బద్వేల్ నియోజకవర్గంలో 60వేలు, కమలాపురం నియోజకవర్గంలో 61వేలు సంతకాలు సేకరించారు. జమ్మలమడుగు నియోజకవర్గానికి 60వేల సంతకాలు లక్ష్యంగా నిర్ణయించగా ఇప్పటివరకూ జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం మండలాల్లోనే 26వేల సంతకాలు సేకరించారు. మిగిలిన మండలాల్లో సంతకాల సేకరణ ముమ్మరంగా కొనసాగుతోంది. అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాలను ఈనెల 10న జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి, ఇక్కడి నుంచి ఈనెల 13న పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. అదే రోజు పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. 16వ తేది సాయంత్రం వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు గవర్నర్‌ను కలిసి కోటి సంతకాలను ఆయనకు అందజేయనున్నారు. జిల్లాలో జరిగిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలను ఒకసారి పరిశీలిస్తే...ఇదొక పెద్ద ఉద్యమంలా కొనసాగిందని చెప్పవచ్చు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలు సంతకాల ఉద్యమానికి మద్దతు తెలిపారు. గ్రామాల్లో, వార్డుల్లో, పట్టణాల్లో డివిజన్లలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రజలు సంతకాలు చేసి తమ వ్యతిరేకతను ప్రభుత్వానికి చాటి చెప్పారు. ఇంతకుమించి ముందుకెళితే ప్రజా ఉద్యమం ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన చేస్తున్న ఈ యజ్ఞంలో ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు పూర్తిస్థాయిలో భాగస్వామ్యమయ్యారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులను సమన్వయం చేసుకుంటూ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తే కలిగే నష్టాలను ప్రజలకు వివరించి వారి మద్దతు కూడగట్టడంలో సఫలీకృతమయ్యారు.
పులివెందుల, ప్రొద్దుటూరులో లక్ష దాటిన సంతకాలు
ఈనెల 10న జిల్లా కేంద్రాలకు సంతకాల పత్రాలు
13న కేంద్ర కార్యాలయానికి...అదేరోజు భారీ ర్యాలీలు
16న గవర్నర్‌కు అందజేయనున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్, ముఖ్య నేతలు


