8 నుంచి స్పాట్ అడ్మిషన్లు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్ ,ఎమ్మెస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాలను ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ అఫ్ అడ్మిషన్స్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్స్, 2 సెట్ల జిరాక్స్ కాపీలను, నిర్ణీత ఫీజుతో విశ్వవిద్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం ప్రాంగణంలో ఉన్న డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కా ర్యాలయంలో హాజరు కా వాలని సూచించారు. వివరాలకు yvu.edu.inను సంప్రదించాలని సూచించారు.
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఈ నెలకుగానూ జొన్నలు, రాగులు పంపిణీకి అందుబాటులో ఉన్నాయని, కార్డుదారులకు బియ్యానికి బదులుగా జొన్నలు లేదా రాగులు కార్డుకు మూడు కిలోల చొప్పున ఉచితంగా అందజేస్తున్నామని జేసీ అదితిసింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త (స్మార్ట్) రేషన్‌కార్డులను సెప్టెంబరు 1వ తేది నుంచి సచివా లయ సిబ్బంది, రేషన్‌షాపు డీలర్ల ద్వారా పంపిణీ చేస్తున్నామని, ఇప్పటివరకు 5,21,604 కార్డుదారులకు అందజేశామని పేర్కొన్నారు. వివిధ కారణాలతో ఇంకా 52,071 కార్డులు పంపిణీ కాలేదన్నారు. ఇప్పటివరకు కార్డులు తీసుకోని వారు తమ సమీప సచివాలయం వద్దకు వెళ్లి ఏ కార్డు ఏ షాపు పరిధిలో ఉందో తెలుసుకుని కార్డులోని సభ్యుల్లో ఒకరు స్మార్ట్‌కార్డు తీసుకోవాలని సూచించారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలో 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులకు ఈ నెల 8వ తేది నుంచి ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. అన్ని సబ్జెక్టులకు వారి వారి డివిజన్లలో 8 నుంచి 10వ తేదీ వరకు ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని.. ఉపాధ్యాయులు హాజరుకావాలని డీఈఓ తెలిపారు. ఇందులో కడప డివిజన్ ఉపాధ్యాయులకు కడప నగరంలోని జయనగర్ కాలనీ బాలికల జెడ్పీ ఉన్నత పాఠశాలలో, బద్వేల్ డివిజన్ వారికి బద్వేల్ జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో, ప్రొద్దుటూరు డివిజన్ వారికి ప్రొద్దుటూరులోని అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్, పులివెందుల డివిజన్ వారికి పులివెందుల జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలలో ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని తెలిపారు. 8వ తేదీ ఉదయం తెలుగు, మధ్యాహ్నం గణితం, 9వ తేదీ ఉదయం ఫిజికల్ సైన్సు, బయలాజికల్ సైన్సు, మధ్యాహ్నం హిందీ, 10వ తేదీ ఉద యం ఇంగ్లిష్, మధ్యాహ్నం సోసియల్ స్టడీస్‌పై ఓరియంటేషన్ క్లాసులు ఉంటాయని తెలిపారు.
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలోకి అనుమతించబోమని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్‌ఎంఎంఎస్ పరీక్షను జిల్లాలో నాలుగు కేంద్రాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంబంధిత పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు జరుగుతుందని తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. విద్యార్థులు తప్పని సరిగా హాల్‌టికెట్‌తో తమకు కేటాయించిన పరీక్షా కేంద్రానికి ఉదయం 9కి చేరుకోవాలని సూచించారు.
● మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ వాచ్‌లు,కాలిక్యులేటర్ ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని, అలాగే మధ్యా హ్నం 1 గంట ముందు పరీక్షా కేంద్రం నుంచి బయటకు అనుమతించరని వివరించారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళనకు గురి కాకుండా పరీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని డీఈఓ సూచించారు.
ప్రొద్దుటూరు: స్థానిక వైఎస్సార్ ఇంజనీరింగ్ ఆఫ్ యోగివేమన యూనివర్సిటీలో శనివారం సెక్యూరిటీ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనే అంశంపై పీఎం ఉషా ఫండ్స్ సహకారంతో జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ సురేష్‌బాబు, వరంగల్ ఎన్‌ఐటీ ప్రొఫెసర్ పాల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, కంప్యూటర్ విజన్, ఐఓటీ, సెక్యూరిటీ అంశాలపై విద్యార్థులకు, రీసెర్చ్ స్కాలర్స్‌కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జి.జయచంద్రారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య రమణయ్య, సదస్సు కన్వీనర్ నాగరాజు మాట్లాడుతూ ఏఐ, మిషన్ లెర్నింగ్ సదస్సు వల్ల విద్యార్థులకు సరికొత్త ఆవిష్కరణలకు అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లు సంయుక్త ఆచార్యులు ఆర్.ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్.కిరణ్ వ్యవహరించారు.


