హోమ్ గార్డుల సేవలు అభినందనీయం
కడప అర్బన్ : పోలీసులతో సమానంగా విధులు నిర్వహిస్తూ అందరి మన్ననలు చూరగొంటున్న హోమ్ గార్డుల సేవలు అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. 63 వ హోమ్ గార్డుల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో శనివారం నిర్వహించిన వేడుకలకు జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోమ్ గార్డుల పెరేడ్‌ను పరిశీలించి, గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్, నేర దర్యాప్తు, కంప్యూటర్ విధుల్లో ఇలా అన్ని చోట్లా హోమ్‌గార్డులు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. హోమ్‌గార్డుల వల్ల పోలీస్ వ్యవస్థకు మరింత బలం వచ్చిందన్నారు. హోమ్‌గార్డుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, సమస్యలేమైనా ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు మాట్లాడుతూ ఒకప్పుడు వలంటరీ ఆర్గనైజేషన్‌గా ప్రారంభమై ప్రస్తుతం హోమ్ గార్డ్స్ సేవలందించని విభాగం లేదంటే అతిశయోక్తి లేదన్నారు. హోమ్ గార్డ్ సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఎ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ హోంగార్డులు పోలీసులకు, ప్రజలకు మధ్య వారధిలా విధులు నిర్వహిస్తున్నారన్నారు. అనంతరం విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన హోమ్ గార్డులకు, క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు, ప్రశంసా పత్రాలు అందచేశారు.
నవంబర్ నెలలో పదవీ విరమణ పొందిన హోమ్ గార్డ్ (ఏఎ 89) ఎన్.వెంకట సుబ్బయ్య కు జిల్లాలోని హోమ్ గార్డులు స్వచ్ఛందంగా ఒక రోజు వేతనాన్ని అందజేశారు. మొత్తం రూ. 4,12,510 చెక్కును జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వెంకట సుబ్బయ్యకు అందజేశారు.
పెరేడ్ అనంతరం పెరేడ్ గ్రౌండ్ నుంచి హోమ్ గార్డుల ర్యాలీని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. డీఎస్పీ నాగేశ్వర రావు, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, డీపీఓ ఏ.ఓ. కె.వి. రమణ, పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రేష్మ, ఆర్.ఐ లు శివరాముడు, శ్రీశైల రెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, నగరంలోని సి.ఐ లు, ఆర్.ఎస్.ఐ.లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, హోమ్‌గార్డులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
హోమ్ గార్డుల సేవలు అభినందనీయం


