ఎమ్మెల్యే చెప్పారని..
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీ కార్యకర్తకు సిఫారస్సు చేయడంతో ఒకటో తేదీ వరకు రేషన్ షాప్‌నకు సరుకు ఇవ్వకపోవడంతోపాటు ఒకటో తేదీ డీలర్‌ను మార్చి వెంటనే సరుకులు పంపిణీ చేసిన సంఘటన సోమవారం ప్రొద్దుటూరులో జరిగింది. శ్రీనివాసనగర్‌లోని 33వ రేషన్ షాప్‌నకు సంబంధించిన డీలర్ తనను కూటమి నేతలు అన్యాయంగా తొలగించారని కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తిరిగి అదే డీలర్‌కు రేషన్ షాప్‌ను కేటాయించారు. నిబంధనల ప్రకారం ప్రతినెల 26వ తేదీ నుంచి 30వ తేదీలోపు వృద్ధులు, దివ్యాంగులకు సరుకులు పంపిణీ చేసి ఒకటో తేదీ నుంచి యథావిధిగా పంపిణీ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. తమ పార్టీ కార్యకర్తకు రేషన్ షాప్ ఇవ్వాలనే ఆలోచనతో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కోర్టుకు వెళ్లిన డీలర్‌పై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలపై రెవెన్యూ అధికారులు ఆ డీలర్‌ను తొలగించి టీడీపీ కార్యకర్త గఫార్‌కు కేటాయించారు. వారం రోజుల ముందుగానే సరుకులు పంపిణీ చేయాల్సి ఉండగా రెవెన్యూ అధికారులు ఒకటో తేదీన పాత డీలర్‌ను సస్పెండ్ చేయడం, టీడీపీ కార్యకర్తకు ఇవ్వడం, వెంట వెంటనే గోడౌన్ నుంచి సరుకులు అందించి పంపిణీని ప్రారంభించారు.


