బడా నేతల భాయీ భాయీ.. కార్యకర్తల్లోనే లడాయి !
కాంట్రాక్టు పనులు, సహజ వనరుల పంపకాలు, కంపెనీల నుంచి కమీషన్లు..ఆర్థిక లావాదేవీలు.. లాభాలు.. ఇలా అన్నింట్లోనూ ఆ ఇద్దరి మధ్య దోస్తీ కుదిరింది. బాబాయ్.. అబ్బాయ్ ‘బంధం’ మరింత బలపడింది.. జెండాలు వేరైనా ‘ఆర్థిక ఎజెండా’ ఒక్కటే కావడంతో ఎంచక్కా ప్రయాణం సాగుతోంది. ఎటొచ్చి గ్రామాల్లో కార్యకర్తలే ఇరువర్గాలుగా విడిపోయారు. ‘మా నాయకుడు.. మీ నాయకుడంటూ’ గొడవలు చేసుకుంటూ శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. స్టేషన్లు...కోర్టుల చుట్టూ తిరుగుతూ పచ్చని జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఆ ఇద్దరు నేతల స్వార్థ రాజకీయాలకు కార్యకర్తలు బలిపశువులుగా మారుతున్నారు.
● రంజుగా జమ్మలమడుగు రాజకీయం
● ఆదాయాల వద్ద బాబాయ్..అబ్బాయ్ దోస్తీ
● గ్రామాల్లో కార్యకర్తలేమో
ఇరు వర్గాలుగా విడిపోయి కుస్తీ!
సాక్షి టాస్క్‌ఫోర్సు : జమ్మలమడుగు రాజకీయాలు రంజుగా మారాయి. కూటమి పార్టీలైన బీజేపీకి ఆదినారాయణరెడ్డి, టీడీపీకి భూపేష్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసకు బాబాయ్.. అబ్బాయ్ అయిన వీరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. ప్రస్తుతం బీజేపీ ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఎన్నికల సమయంలో ఇరువర్గాలుగా విడిపోయిన వీరు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టు పనుల్లో.. కమీషన్లలో ఎంచక్కా ఇద్దరి మధ్య మంచి సయోధ్యే ఉంది. ఎటొచ్చీ గ్రామాల్లో ఉన్న కార్యకర్తలు భూపేష్ వర్గం, ఆది వర్గంగా విడిపోయారు.
జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆరు మండలాల్లో గ్రామ, మండల స్థాయి నేతలు ఇప్పటికే రెండు గుంపులుగా బీజేపీ, టీడీపీ అని కాకుండా ఆదివర్గం, భూపేష్‌వర్గాలుగా విడిపోయారు. ఈ నేపథ్యంలో గ్రామాల్లో చిన్న చిన్న కాంట్రాక్టు పను ల విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయ పంపకాలలో రెండు వర్గాల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటూ స్టేషన్ మెట్లు ఎక్కుతున్నారు.
● ఇటీవల ఆదినారాయణ రెడ్డి వర్గం ఎర్రగుంట్ల మండలం కలమల్లలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టింది. అంతే భూపేష్ వర్గీయులు ఆ పనులను ఆడ్డుకున్నారు. తమ ప్రాంతంలో తామే పనులు చేసుకుంటామని మీరేవరు చేయటానికి అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేయని పరిస్థితి.
● పది రోజుల క్రితం ముద్దనూరు పట్టణంలో స్మార్టు కిచెన్ షెడ్డు నిర్మాణ పనులను భూపేష్ వర్గీయులకు కేటాయించారు. అయితే ఆదివర్గంలో ఉన్న ఓ నాయకుడు సదరు పనులు చేయకుండా అడ్డు పడుతున్నాడు. ఆ పనులను తమకు అప్పగించాలంటూ సదరు నాయకుడు అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివర్గానికి చెందిన వారిపై భూపేష్ వర్గీయులు కత్తితో దాడికి ప్రయత్నించారు. ఈ ఘటనలో పోలీసులు 307 కేసు నమోదు చేసి భూపేష్ వర్గీయులకు కోటింగ్ ఇచ్చారు. నిందితులు జరిగిన విషయాన్ని తమ నాయకుడిని వివరించారు. స్పందించిన సదరు నాయకుడు పోలీసు అధికారికి ఫోన్ చేసి ‘307 కేసు ఎలా నమోదు చేస్తావు. ఏవిధంగా చేస్తావంటూ’ ఇష్టారాజ్యంగా మాట్లాడినట్లు సమాచారం. అనంతరం బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయించారు.
పోలీసులపై ఇరు వర్గాల ఒత్తిళ్లు..
జమ్మలమడుగు నియోజకవర్గంలో పని చేసే పోలీసు అధికారులపై నాయకుల ఒత్తిళ్లు రోజురోజుకు ఎక్కు వవుతున్నట్లు తెలుస్తోంది. ఆదివర్గం.. భూపేష్ వర్గంగా విడిపోయిన కార్యకర్తలు గ్రామాల్లో అధిపత్యం కోసం.. పనుల్లో వాటాల కోసం చీటికి మాటికి స్టేషన్లలో పంచాయితీలు పెడుతున్నారు. చిన్న మాటొచ్చి నా చాలు ఘర్షణలు పడుతూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టే స్థాయికి వెళుతున్నారు. తీరా ఇరు వర్గాల నాయకుల నుంచి పోలీసులపై ఒత్తిడి వస్తుండటంతో పోలీసులు ఏం చేయాలో ఆర్థం కాక తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. చివరికి రాజీ యత్నాలు చేసి చేతులు దులుపుకునే పనిలో పడ్డారు.
బడా నేతల భాయీ భాయీ.. కార్యకర్తల్లోనే లడాయి !


