ఉచితమే.. ప్రయాణం నరకమే !
● ప్రయాణికులకు తగిన సంఖ్యలో లేని బస్సులు
● ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్
కడప కోటిరెడ్డిసర్కిల్ : చంద్రబాబు ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన సీ్త్ర శక్తి ఉచిత బస్సు పథకం ఆర్టీసీకి తీవ్ర నష్టం కలిగించడంతోపాటు ప్రజలకు నరకప్రాయంగా మారింది. సరిపడా బస్సులు లేక మహిళలతోపాటు పురుషులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం కష్టంగా మారిందని మహిళలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణ ప్రయాణికులు కిక్కిరిసిన ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు పడలేక ప్రైవేటు బస్సులు, ఆటోలు, మరికొంతమంది కార్లలో రాకపోకలు సాగిస్తుండడం గమనార్హం. జిల్లాలోని ఆరు డిపోలలో 309 బస్సులు పరుగులు పెడుతున్నాయి. వీటిలో కొన్ని అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయి.
సీట్ల కోసం అగచాట్లు
మహిళా ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్న తరుణంలో బస్సు సర్వీసులు తక్కువగా ఉండడంతో సీట్ల కోసం మహిళలు ఘర్షణ పడే పరిస్థితిని చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక పండుగలు.. ఉత్సవాల సమయంలో ప్రయాణికుల పరిస్థితి వర్ణణాతీతం. ఉచిత ప్రయాణం పథకంపై గొప్పలు చెప్పిన ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచకపోవడం దారుణమని ప్రయాణికులు మండిపడుతున్నారు. సాధారణంగా బస్సుల్లో సగటున ఓఆర్ శాతం 50 వరకు మాత్రమే ఉండేది. ఉచిత ప్రయాణం ప్రారంభించిన నాటి నుంచి ఓఆర్ శాతం 70 వరకు పెరిగింది. 50 మందితో వెళ్లాల్సిన పల్లె వెలుగు బస్సుల్లో 100–150 మంది ప్రయాణిస్తున్నారు. మహిళలు పడుతున్న ఇబ్బందులపై అధికారులుగానీ, ప్రభుత్వంగానీ పట్టించుకున్న పాపాన పోలేదు. కిక్కిరిసిన బస్సుల్లో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారు.
విద్యార్థులకు తప్పని పాట్లు
కడప నగరంలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో సుమారు 6–8 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో అనేకమంది పేద, మధ్యతరగతి విద్యార్థులు నెలవారి బస్సు పాసులు తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. సీ్త్ర శక్తి పథకంలో విద్యార్థినిలకు ప్రయాణం ఉచితమే అయినా వారి ప్రయాణం ప్రమాదకరంగా మారింది. పలు గ్రామాల నుంచి స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు వేచివున్న విద్యార్థులను చూసి బస్సులు ఆపడం లేదు. బస్సుల్లో ఏమాత్రం ఖాళీ లేని పరిస్థితుల కారణంగా ఇలా చేయాల్సి వస్తోందని డ్రైవర్లు, కండక్టర్లు చెబుతున్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరముందని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.


