కమ్మేసిన మేఘాలు
● భారీ వర్ష సూచనను తలపించిన మబ్బులు
● మోస్తరు వానలతో ఊరట
● జిల్లా వ్యాప్తంగా 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం
● కొనసాగుతున్న తుపాను ప్రభావం
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా దిత్వా తుఫాను ప్రభావం కొనసాగుతోంది. సోమవారం భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఆ మేరకు ఉదయం నుంచి కమ్మేసిన కారు మేఘాలతో వాతావరణం గంభీరంగా కనిపించింది. భారీ వర్షాలు కురుస్తాయని అందరూ భావించారు. మోస్తరు వానలతో ఊరట చెందారు. అత్యధికంగా రాజుపాలెంలో 8.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత చింతకొమ్మదిన్నె, ఒంటిమిట్టలో 6.2 మి.మీ, సిద్దవటం 5.8, వీఎన్‌పల్లె, కమలాపురం 5.6 మి.మీ. చొప్పున వర్షం పడింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 111.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాగా, తుఫాను ప్రభావం కొనసాగుతూనే ఉంది.
రైతుల్లో గుబులు : వరుస తుపాన్ల కారణంగా జిల్లాలోని రైతాంగం నష్టాలను చవిచూసింది. ప్రధానంగా వరి, శనగ, కంది, పత్తి తదితర పంటలకు చెందిన రైతులు వర్షాల కారణంగా ఇప్పటికే నష్టాలను చవిచూశారు. తాజాగా దిత్వా తుపానుతో ప్రధానంగా వరి, పత్తి, శనగ తదితర పంటలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ తుపాను ఇలాగే కొనసాగితే తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
సూచనలు : జిల్లాలో వర్ష సూచనలు ఉన్నందున నారుమడి, నాట్లు దశ ఉన్న వరి పంటల్లో గట్లు, నీటి కాలువలను సరిచేసుకుని, అధిక నీటిని వెలుపలకు పంపాలి. శిలీంధ్రపు తెగుళ్లు ఆశించకుండా వర్షం లేని రోజున హెక్సా క్రోమోజోల్ 2 మి.లీ. లేక ప్రొపికనజోల్ 1 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేసుకోవాలి. డిసెంబరు 2వ తేదిన అధిక వర్ష సూచన ఉన్న కారణంగా రబీ వేరుశనగ విత్తే రైతులు వర్షం ఆగిన తర్వాత వేరుశనగ విత్తుకోవాలి.ముఖ్యంగా నేలలో అధిక తేమ శాతం లేకుండా పంట విత్తుటకు తగిన తేమ ఉన్నప్పుడు మాత్రమే విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.


