చెన్నకేశవా..దర్శనమివ్వవా !
రాజంపేట : తాళ్లపాక గ్రామంలో పదకవితాపితామహుడు అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ తలుపులు సోమవారం తెరుచుకోలేదు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండి చేసేదేమిలేక వెనుదిరిగారు.ఆలయ తలుపులు తెరవని సంఘటనపై గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు స్పందించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీకి మెమో ఇచ్చారు. టీటీడీ విజిలెన్స్ ఏఎస్‌ఐని, టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ను హుటాహుటిన తాళ్లపాకలోని చెన్నకేశవస్వామి ఆలయానికి పంపించారు. మధ్యాహ్నం 12.30గంటలకు తాళాలు పగులగొట్టించి తలుపులు తెరిపించారు. అప్పటి వరకు స్వామివారికి పూజలు ఆగిపోయాయి. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ బాలాజీ, సూపరిండెంట్ హనుమంతయ్య సక్రమంగా విధులకు హాజరుకావడంలేదని టీటీడీ డిప్యూటీ ఈవోకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు.
● ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం సమయంలో ఆలయానికి సీలు వేయాలంటే టెంపుల్ ఇన్‌స్పెక్టర్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. అవి ఇక్కడ అమలుకాలేదని గ్రామస్తులు ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న నాయీబ్రహ్మణులతో ఆలయానికి సీలు వేయించడం, మళ్లీ ఓపెన్ చేయడం జరుగుతోందని వాపోయారు.
● స్థానిక టెంపుల్ ఇన్‌స్పెక్టర్ అందుబాటులో లేరని తాళ్లపాక వాసులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్టలో ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో రెండుమార్లు ఆలయ తలుపలు తెరుచుకోలేదంటున్నారు. ఐదురోజుల కిందట టీటీడీ వారు అందజేసిన ఆవు కూడా కనిపించకుండా పోయిందన్నారు. భక్తులు తాగేందుకు మంచినీరు అందుబాటులో లేదని చెబుతున్నారు.


