ఎన్‌ఎంఎంస్ నమూనా పరీక్షకు విశేష స్పందన
పులివెందుల : పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్‌ఎంఎంఎస్ ప్రతిభా నమూనా పరీక్షకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.కె.వెంకటనాథరెడ్డి మార్గదర్శకత్వంలో పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రతిభా నమూనా పరీక్షలు విద్యార్థుల నైపుణ్యాలకు కొలమానాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి హాజరై మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్పతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ బ్రోచర్‌ను ఆవిష్కరించి ప్రతిభా నమూనా పరీక్ష ప్రశ్నా పత్రాన్ని విడుదల చేసి పరీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి జాతీయ ఉపకార ప్రతిభా నమూనా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షకు 564 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, సీనియర్ ఉపాధ్యాయుడు గుజ్జుల కృష్ణారెడ్డి విజేతలను ప్రకటించారు. పులివెందుల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.హిమశ్రీ మొదటి బహుమతి సాధించి రూ.5 వేలు, చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.వరుణ్ తేజ్, జి.మైథిలి ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచి రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు సాధించారు. మరో 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు పొందారు. అనంతరం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి రూ.15 వేలు, లింగాల ఎంఈఓ రూ.2,500, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.అమర్నాథరెడ్డి, రూ.2,500 నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్, ఎంఈఓలు చంద్రశేఖరరావు, రామానాయుడు, విశ్వనాథరెడ్డి, రామకృష్ణయ్య, రామచంద్రారెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్‌రెడ్డి, రఘునాథరెడ్డి, జగన్, వెంకటరెడ్డి, చలమారెడ్డి, మదార్, సుభాష్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


