భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ, రాష్ట్ర అధ్యక్షుడు పుప్పాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పాత రిమ్స్‌లోని బీసీ భవన్‌లో భవన నిర్మాణ కార్మికుల రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీ భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు చట్టం 1996ను పటిష్టంగా అమలు చేసి, సంక్షేమ బోర్డు ద్వారా పథకాలు అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇప్పటి వరకు నెరవేర్చలేదన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకు కోటి రూపాయల విరాళం వెంటనే జమ చేయాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన మాటను మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లెయిమ్‌లకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులను రాష్ట్ర వ్యాప్తంగా సమీకరించి డిసెంబర్‌లో చలో మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, ఏపీ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ ఉద్దె మద్దిలేటి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీరాములు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, జిల్లా డిప్యూటీ సెక్రటరీ కేసీ బాదుల్లా, యూనియన్ నాయకులు లింగన్న, బి.రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


