నేడు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎండీ
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1వతేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్‌పీడీసీఎల్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను ’సీఎండీ’ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
’దిత్వా’ తుఫాను వేళ ఆప్రమత్తంగా ఉండండి
’దిత్వా’ తుఫాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలిపోవడం లాంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు.


