చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్‌

Nov 30 2025 7:16 AM | Updated on Nov 30 2025 7:16 AM

చోరీ

చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్‌

బద్వేలు అర్బన్‌ : స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గల జె.బి. స్వర్ణ దుకాణంలో సుమారు మూడు నెలల క్రితం జరిగిన చోరీ కేసుకు సంబంధించి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన నిందితుడిని బద్వేలు అర్బన్‌ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 72 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐదున్నర కిలోల వెండి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. శనివారం స్థానిక అర్బన్‌ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్‌ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని మార్కెట్‌వీధికి చెందిన జబీవుల్లా స్థానిక సిద్దవటం రోడ్డులోని మసీదు కాంప్లెక్స్‌లో గత కొన్నేళ్లుగా వెండి, బంగారు ఆభరణాల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు నెల 9వ తేదీన రోజూ మాదిరే వ్యాపార కార్యకలాపాలు పూర్తి చేసుకుని దుకాణంలోని వస్తువులన్నీ సర్ది బ్యాగులో ఉంచి ఇంటికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే కాపు కాసిన కొందరు యువకులు దుకాణంలోకి వెళ్లి.. బంగారు, వెండి ఆభరణాలను భద్రపరిచిన బ్యాగులను తీసుకుని బైక్‌లో పరారయ్యారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న అర్బన్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు ఒరిస్సా రాష్ట్రం గంజామ్‌ జిల్లా ఆస్కా తాలూకా కలసందాపూర్‌ గ్రామానికి చెందిన దాస్‌ శ్రీరామ్‌గా గుర్తించారు. ఈ క్రమంలో శనివారం అర్బన్‌ సీఐ లింగప్ప సిబ్బందితో కలిసి బద్వేలు– నెల్లూరు ప్రధాన రహదారిలోని పాలిటెక్నిక్‌ కళాశాల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా.. దాస్‌ శ్రీరామ్‌ ఆటోలో వస్తుండగా ఆపి తనిఖీ చేయగా అతని వద్ద బంగారు, వెండి ఆభరణాలు లభించాయి. నిందితుడిని అదుపులోకి తీసుకుని కోర్టు ఎదుట హాజరు పరిచినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా నిందితుడు దాస్‌శ్రీరామ్‌ అతని స్నేహితుడైన ఒరిస్సా రాష్ట్రానికి చెందిన రావులబినోద్‌ అలియాస్‌ బిన్ను గతంలో పలు చోరీ కేసులలో ఒరిస్సా రాష్ట్రంలో జైలుకు వెళ్లారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన తొండపోతురాజు, అతని అన్న మౌలాలితో కలిసి బద్వేలులో చోరీకి పాల్పడినట్లు విచారణలో తేలిందని, త్వరలోనే వారిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. సమావేశంలో అర్బన్‌ ఎస్‌ఐ సత్యనారాయణ, క్రైమ్‌ పార్టీ ఏఎస్‌ఐ రాంభూపాల్‌రెడ్డి, అర్బన్‌ స్టేషన్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కె.శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు శివ, వెంకటేష్‌, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు.

విషపు ఇంజెక్షన్‌ వేసుకుని యువకుడి ఆత్మహత్య

చాపాడు : మండల పరిధి చిన్నగురువలూరు గ్రామంలోని దళితవాడకు చెందిన కుచ్చుపాప వినోద్‌ కుమార్‌ (26) అనే యువకుడు పాయిజన్‌(విషపు) ఇంజెక్షన్‌ వేసుకుని శనివారం తెల్లవారుజామున కడపలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చాపాడు పోలీసులు, చిన్న గురువలూరు గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనస్థీషియాగా కడప నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పని చేస్తున్న వినోద్‌కుమార్‌ ఓ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం కావడంతోపాటు ఆరు నెలల క్రితం తన తల్లి అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సంఘటన నేపథ్యంలో మనోవేదనకు గురైన వినోద్‌ కుమార్‌ మనస్తాపం చెంది శనివారం తెల్లవారుజామున తాను పని చేసే ఆస్పత్రి సమీపంలో నివాసం ఉంటున్న అద్దె గదిలో పాయిజన్‌ ఇంజెక్షన్‌ వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించే క్రమంలో విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు ఘటనా స్థలం వద్దకు వెళ్లారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి వీరయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్‌ తెలిపారు. మృతుడికి తండ్రితోపాటు అక్క, తమ్ముడు ఉన్నారు.

ప్రేయసి ఒత్తిడి, వివాహేతర సంబంధమే కారణమా..

వినోద్‌ కుమార్‌ గత కొన్నేళ్లుగా తన కులానికి చెందిన ఓ మహిళతో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఇటీవల ఈ మహిళ గర్భవతి కావడంతో వివాహం చేసుకోవాలని వినోద్‌ కుమార్‌పై ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో వినోద్‌ కుమార్‌ మరో యువతితో ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ ముగ్గురు మధ్య నెలకొన్న వివాదాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై మనోవేదనతో వినోద్‌ కుమార్‌ పాయిజన్‌ ఇంజెక్షన్‌ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. ప్రయోజకుడై చేతికి అందిన కుమారుడు అనూహ్యంగా మృతి చెందడంతో తండ్రి, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు.

రూ.8.60 లక్షల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం

ప్రేమ విఫలం, మనోవేదన కారణమంటున్న గ్రామస్తులు

చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్‌1
1/1

చోరీ కేసులో ఒరిస్సా వాసి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement