ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత
ప్రొద్దుటూరు : స్థానిక మున్సిపల్ కార్యాలయ సభాభవనంలో శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. సమావేశం ఎందుకు ఆలస్యంగా ప్రారంభించారని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. తాను మధ్యాహ్నం 3 గంటలకే వచ్చానని, ఇతర కౌన్సిలర్లు వచ్చే వరకు ఉన్నందున 20 నిమిషాల తర్వాత సమావేశాన్ని ప్రారంభించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ సీసీని ఎందుకు మార్చారని చైర్‌పర్సన్‌తోపాటు వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి.. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని గట్టిగా నిలదీశారు. సీసీని మార్చే అధికారం తనకు ఉందని, ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని కమిషనర్ తెలిపారు. దీంతో వైస్ చైర్మన్లు మరింత గట్టిగా వాదించారు. వైస్ చైర్మన్లకు సమాధానం చెప్పలేని మున్సిపల్ కమిషనర్ సమావేశం నుంచి బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రతి సమావేశంలో ఇలానే చేస్తున్నారు, సమావేశాన్ని మధ్యలో వదిలేసి ఎలా వెళతారని వైస్ చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కౌన్సిల ర్ల మధ్య మాటల యుద్ధం జరిగి తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఇంతలోనే పోలీసులు సమావేశంలోకి వచ్చి ఏకపక్షంగా వ్యవరించారు. వైస్ చైర్మన్లతోపాటు వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు గరిశపాటి లక్ష్మీదేవి, భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, పాతకోట మునివంశీధర్‌రెడ్డి తదితర కౌన్సిలర్లు పోలీసులను ప్రశ్నించారు. సమావేశంలో నుంచి అర్ధాంతరంగా మున్సిపల్ కమిషనర్ సి.రవిచంద్రారెడ్డి, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, టీడీపీ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. తర్వా త మున్సిపల్ చైర్‌పర్‌పర్సన్ సమావేశాన్ని కొనసాగించి అజెండాలోని 22 అంశాల్లో మూడు అంశాలను వాయిదా వేసి మిగిలిన అంశాలను ఆమోదించారు.
కమిషనర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మున్సిపల్ చైర్‌పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి తెలిపారు. సమావేశం అనంతరం తన చాంబర్‌లో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. నిబంధనల ప్రకారం సమావేశం నిర్వహించాల్సిన కమిషనర్ అర్ధాంతరంగా సమావేశాన్ని వదిలేసి బయటికి ఎలా వెళతారని ప్రశ్నించారు. అధికార పార్టీకి కమిషనర్ పూర్తి అనుకూలంగా, తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. గతంలో ఇలా జరిగితే కోర్టును, ఉన్నతాధికారులను ఆశ్రయించామని తెలిపారు. కమిషనర్ సభలో తమకు సరైన సమాధానం చెప్పడం వల్లే ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు.
● అనుమతి లేని అజెండా రావడంతోనే సమావేశాన్ని బాయ్‌కాట్ చేశానని మున్సిపల్ కమిషనర్ తెలిపారు. ముందుగా నిర్ణయించిన మేరకు ఈనెల 29న కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అజెండా విషయమై చైర్‌పర్సన్ సీసీని ప్రశ్నించగా తనకు తెలిసిన సమాచారం మేరకు అజెండాను అందరికీ పంపించామని తన దృష్టికి తెచ్చారన్నారు. తనకు తెలియకుండా, తన సంతకం లేకుండా అజెండాను సభ్యులకు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించానన్నారు.
అర్ధంతరంగా వెళ్లిన మున్సిపల్
కమిషనర్, ఎమ్మెల్యే, టీడీపీ కౌన్సిలర్లు
అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు
వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం
ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో ఉద్రిక్తత


