సచివాలయం ఎదుట టీడీపీ సానుభూతిపరుల ధర్నా
● డిజిటల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంపై నిరసన
● హౌసింగ్ ఎంట్రీకి చివరి తేదీ కావడంతో ఆందోళన
సింహాద్రిపురం : చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల టీడీపీ సానుభూతిపరులే పెదవి విరుస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ప్రభుత్వ పథకాలు అందించేవారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థపై అశ్రద్ధ కనబరుస్తోంది. ఫలితంగా పథకాలు అర్హులకు సక్రమంగా అందడం లేదు. ఇందుకు నిదర్శనం సింహాద్రిపురం మండల పరిధిలోని కోవరంగుంటపల్లె సచివాలయాన్ని తీసుకోవచ్చు. ఆ సచివాలయం ఎదుట శనివారం కోవరంగుంటపల్లె, బొజ్జాయిపల్లె గ్రామాలకు చెందిన టీడీపీ సానుభూతిపరులు ధర్నా చేపట్టారు. సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని వారు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరమైన కుల, ఆదాయ సర్టిఫికెట్లకు రెండు, మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నా ఇంత వరకు మంజూరు చేయలేదన్నారు. ఇళ్ల దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 30వ తేదీ చివరి తేదీ అని తెలిపారు. ఈ సచివాలయంలో సిబ్బంది పనితీరు సరిగా లేదని, ఒకరి మీద ఒకరు చెప్పుకొంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. అర్హత ఉండి ఇళ్ల మంజూరుకు దరఖాస్తు చేసుకోవడానికి కుల, ఆదాయ సర్టిఫికెట్లను అందించడంలో సిబ్బంది విఫలం కావడంతో ఈ ధర్నా చేపట్టినట్లు తెలిపారు. సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ రెండు నెలలుగా విధులకు సరిగా హాజరు కాకపోవడమే కాకుండా ప్రజలకు అందుబాటులో కూడా ఉండటం లేదన్నారు. శనివారం సచివాలయానికి వెళితే డిజిటల్ అసిస్టెంట్ విధులకు హాజరు కాలేదన్నారు. డిజిటల్ అసిస్టెంట్ అధికారికంగా సెలవులో లేకున్నా.. సెలవులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారని వారు ఆరోపించారు.
ఎంపీడీఓను నిలదీసిన వైనం
ఈ విషయం తెలుసుకున్న ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి కోవరంగుంటపల్లె గ్రామ సచివాలయం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఆందోళనకారులు నిలదీశారు. ఇళ్ల మంజూరులో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇళ్లుఉ కోల్పోయామని, దీనిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అర్హులకు న్యాయం చేయాలని, లేకపోతే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామన్నారు. దీనిపై స్పందించిన ఎంపీడీఓ మాట్లాడుతూ ఆ పత్రాలు లేకున్నా ఇళ్ల మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. అర్హులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతామన్నారు.


