ఉరి వేసుకుని వ్యక్తి బలవన్మరణం
పులివెందుల రూరల్ : పులివెందులలోని ఇస్లాంపురంలో నివాసముంటున్న నూర్ శనివారం ఉరి వేసుకుని బలవన్మరణం పొందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నూర్ అనే వ్యక్తికి మాబి అనే అమ్మాయితో వివాహం జరిగింది. నాలుగేళ్లకే వారు విడిపోయారు. అప్పటి నుంచి నూర్ పులివెందులలోని హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలో పని చేస్తున్నాడు. తల్లి దగ్గరే ఉంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో తల్లి బంధువుల ఊరు గుంతకల్లు వెళ్లడం, కుటుంబం దూరం కావడంతో జీవితంపై విరక్తి చెందాడు. మద్యం మత్తులో శనివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
7న పూర్వ విద్యార్థుల సమ్మేళనం
రాజంపేట : రాజంపేట సమీపంలోని నారమరాజుపల్లె వద్ద ఉన్న జవహర్ నవోదయ విద్యాలయంలో డిసెంబర్ 7న పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్‌ఆర్ కడప జిల్లాలో నవోదయ విద్యాలయంలో చదివి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న, వివిధ ఉద్యోగాలలో స్థిరపడిన వారు రావాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత విద్యాలయంలో చదువుతున్న విద్యార్థులతో వారి అనుభవాలు, విజయాలను తెలియజేసి, ప్రేరణ నింపాలని వివరించారు.


