మళ్లీ వైఎస్ జగన్‌ను సీఎంగా చేద్దాం
కమలాపురం వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో హుందాగా పరిపాలన చేశారని, ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం నడిపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. హామీల అమలులో వైఫల్యం చెంది ప్రజల చీదరింపులకు గురయ్యారన్నారు. అందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తోందన్నారు. ఇందులో క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తల అందరి సహకారం ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీని తనదిగా భావించి కష్టపడుతున్నారని, అందుకు కృతజ్ఞతలు తెలిపారు. మన అందరి లక్ష్యం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకొని, రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడం, ప్రజలకు విశేషమైన సంక్షేమ పథకాలు అందించడం అన్నారు.


