వైఎస్సార్ జిల్లాలోనే సిద్దవటం, ఒంటిమిట్ట కొనసాగించాలి
● రాజకీయాలకతీతంగా నిర్ణయం తీసుకోవాలి
● లేదంటే ప్రజా ఉద్యమం తప్పదు
● వైఎస్సార్‌సీపీ నేతల వెల్లడి
కడప రూరల్ : చారిత్రాత్మక ప్రాంతాలైన సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను పార్టీలకతీతంగా ప్రజాభీష్టం మేరకు వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని ఆ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ శ్రేణులు తెలిపాయి. శుక్రవారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్నమయ్య జిల్లాలో కలపడం దారుణమన్నారు. ఈ రెండు మండలాలకు వైఎస్సార్ కడప జిల్లా కేంద్రం కూత వేటు దూరంలో ఉందన్నారు. అలాంటి ప్రాంతాలను అన్నమయ్య జిల్లాలో కలపడం అన్యాయమన్నారు. దశాబ్దాల తరబడి స్థానిక ప్రజలు తమ పనులు, వివిధ కార్యక్రమాల కోసం కడపకు వస్తున్నారన్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా అన్నమయ్య జిల్లాకు వెళ్లాలంటే అన్ని విధాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నారు.
అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి
టీడీపీ ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి, ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం తీసుకున్ననీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తెలిపారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తగు నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రాణ త్యాగాల కై నా సిద్ధపడి సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు వైఎస్సార్ కడప జిల్లాలోనే ఉండేలా పోరాటం చేస్తామని తెలిపారు. వైఎస్సార్‌సీపీ సిద్దవటం మండలం కన్వీనర్ నీలకంఠారెడ్డి మాట్లాడుతూ సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప కార్పొరేషన్ పరిధిలో దాదాపుగా కలిసిపోయి ఉన్నాయని పేర్కొన్నారు. అలాంటి మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడం ఎంత మాత్రం తగదన్నారు. పూర్వం నుంచి సిద్దవటం, కడపల మధ్య అవినాభావ సంబంధం ఉందన్నారు. టీడీపీ పాలకులు చరిత్రను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రాంతాలను వైయస్సార్ కడప జిల్లాలోనే ఉంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీకాంత్‌రెడ్డి, వైయస్సార్ టీయూసీ రాజంపేట నియోజకవర్గ అధ్యక్షులు బత్తల బతుడు, ఆ పార్టీ నాయకులు ఆలం కృష్ణ చైతన్య, కె.సుబ్బారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, పల్లె సుబ్బరామిరెడ్డి, మల్లయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


