రాష్ట్ర కార్యవర్గంలో చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ సోమసుందర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభతోపాటు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి కే టీవీ ఎడిటర్‌గా ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్‌ను బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ సహకారంతో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వృత్తి నైపుణ్య తరగతుల నిర్వహణకు ప్రయత్నం చేస్తానని వివరించారు. తన నియామకానికి సహకరించిన పూర్వ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
బతికుండగానే
మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు
కలసపాడు : మనిషి బతికుండగానే మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేసిన పంచాయతీ అధికారుల నిర్వాకం బయట పడింది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం దూలంవారిపల్లె గ్రామానికి చెందిన పొన్నం ఆదిలక్ష్మికి ముద్దనూరుకు చెందిన పొన్నం మారుతీరావుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మారుతీరావు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మద్యానికి బానిసైన మారుతిరావు ఆదిలక్ష్మిని తరచూ వేధించేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేక 15 రోజుల క్రితం ఆదిలక్ష్మి తన పుట్టింటికి వచ్చింది. ఆదిలక్ష్మి తండ్రి అయిన మీసాల అంకయ్యకు ఈ నెల 27వ తేదీన రిజిస్టర్ పోస్టులో ఒక కవర్ వచ్చింది. కవర్ తెరిచి చూడగా ఆదిలక్ష్మి మరణ ధ్రువీకరణ పత్రంను ఆమె భర్త మారుతిరావు పంపారు. ఈ నెల 12వ తేదీన ఆదిలక్ష్మి మరణించినట్లు మరణ ధ్రువీకరణ పత్రంలో పొందుపరిచారు. అధికారులు విచారణ చేపట్టి మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేయాల్సి ఉంది. కానీ కాసులకు కక్కుర్తి పడ్డారో ఏమన్నా పైస్థాయి సిఫార్సులకు భయపడ్డారో తెలియదు గానీ సచివాలయ ఉద్యోగులు నిర్లక్ష్యంగా.. బతికి ఉన్న మనిషికి మరణ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు. ఈ విషయంపై ఆదిలక్ష్మి కలసపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్
రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్‌రెడ్డి


