జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణంలో శుక్రవారం పతంగే ఫంక్షన్ హల్‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో.. ఆ పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు విజయ జ్యోతి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కన్యాకుమారి ఎంపీ విజయ్ వసంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన పాముల బ్రహ్మానందరెడ్డిని స్టేజి పైకి పిలవకపోవడంతో ఆయన నాయకులపై అగ్రహించారు. తాను 3 సార్లు జమ్మలమడుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయడం జరిగిందన్నారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మూకుమ్మడిగా బ్రహ్మానందరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో నువ్వెంత నువ్వెంత అంటూ వాగ్వాదం చేసుకున్నారు. చివరికి పోలీస్‌లు వచ్చి బందోబస్తు నిర్వహించారు.
బ్యాంక్‌లో చోరీకి యత్నం
సంబేపల్లె : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చోరీకి చేసిన ప్రయత్నం విఫలమైంది. బ్యాంక్ వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి బ్యాంక్ ముందు భాగంలో ఇనుప రైలింగ్ గేటుకు వున్న తాళం వేసిన గొళ్లెం (పాలం)ను విరగ్గొట్టాడు. అయితే బ్యాంక్‌కు రెండవ డోర్‌గా సెటర్ ఉండటంతో లోపలికి వెళ్లలేక పోయాడు. చివరికి చోరీ ప్రయత్నం విఫలమైంది. ఉన్నతాధికారులకు విషయం తెలియజేశామని బ్యాంక్ అధికారులు తెలిపారు.


