పోలేరమ్మ ఆలయ హుండీలో కానుకలు మాయం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి అనుసంధానంగా ఉన్న కనుమ పోలేరమ్మ దేవస్థానం హుండీలో కానుకలు మాయమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే.. ఈ విషయం వెల్లడవుతోంది. శుక్రవారం హుండీ కానుకలను లెక్కించడానికి మఠం మేనేజర్ ఆదేశాల మేరకు మఠం సిబ్బంది సీల్ వేసిన తాళానికి ఉన్న గుడ్డను తొలగించగా.. అప్పటికే తాళం తెరుచుకుని ఉంది. పైకి మాత్రం సీల్ వేసినట్లు ఉంది. భక్తులు సమర్పించుకున్న కానుకలు తరిగిపోయినట్లు ఈ విధానాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడైనా కొంత నగదు మాత్రం కనిపించింది. గతంలో అయితే హుండీలో ఎలాంటి కానుకలు లేవు. అప్పట్లో మఠం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్యలు లేవు. దీనిని అదునుగా చూసుకొని తాళం తీసి దోచుకుంటున్నట్లు అర్థమవుతోంది. మూడు నెలలకు ఒక సారి హుండీ ఆదాయం లెక్కిస్తారు. ప్రస్తుతం రూ.52 వేలు మాత్రమే ఉన్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జయంత్యుత్సవాలు, దసరా, కార్తీక మాసం తదితర కార్యక్రమాలు జరిగినా.. అతి తక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మఠాధిపతి లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు.


