ప్రైవేట్ హాస్పిటల్ వద్ద ఆందోళన
ప్రొద్దుటూరు క్రైం : డాక్టర్ లేకుండానే తన భార్యకు డెలివరీ చేశారని ఆరోపిస్తూ అమృతానగర్‌కు చెందిన మనోహర్ కుటుంబ సభ్యులు ప్రైవేట్ హాస్పిటల్ వద్ద గురువారం రాత్రి ఆందోళన చేశారు. మనోహర్ భార్య సుమలతకు నొప్పలు రావడంతో ఈ నెల 22న హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు సుఖ ప్రసవం జరిగి మగ బిడ్డను జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన తర్వాత చలనం లేకపోవడంతో వెంటనే చిన్న పిల్లల వైద్యుడి వద్దకు వెళ్లారు. అయితే శిశువు పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో వెంటనే కడప రిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం శిశువు మృతి చెందాడు. తన భార్య ప్రసవ సమయంలో వైద్యురాలు రాలేదని నర్సులే కాన్పు చేశారని మనోహర్ ఆరోపించాడు. ఈ కారణం వల్లనే శిశువు ఏడ్వలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగాడు. ఈ విషయమై డాక్టర్ సమిత మాట్లాడుతూ ప్రసవ సమయంలో తల్లికి ఏదైనా జరిగితే అది గైనకాలజిస్టు బాధ్యత అని అన్నారు. కాన్పు సమయంలో అన్ని విధివిధానాలు పాటించామని ఇందులో తమ నిర్లక్ష్యం ఏమాత్రం లేదన్నారు. ప్రసవం తర్వాత శిశువు ఏడ్వలేదనే కారణంతో చిన్న పిల్లల వైద్యుడి వద్దకు పంపించామన్నారు.


