దేశాన్ని ఏకతాటిపై నడిపిన ఘనత రాజ్యాంగానిదే
కడప అర్బన్ : ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒక తాటిపై నడిపే రాజ్యాంగం మనదని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయం లో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజ్యాంగం అనేది కేవలం గ్రంథం కాదని 125 కోట్ల భారతీయుల ఆత్మ అన్నారు. భారతీయ జీవన గమనాన్ని ప్రతిబింబించే విలువైన సాధనం, మార్గమన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను ఆస్వాదించే ప్రతి ఒక్కరూ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ గుర్తుకు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, ఆర్.ఐ శ్రీశైల రెడ్డి, డీపీఓ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కె.వి రమణ, సూపరింటెండెంట్ శ్రీనివాస నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్


