కదిలిన గ్రీన్‌ఫీల్డ్ హైవే!
ఒకటిన్నర్ర ఎత్తులో..
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతంలోపచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం కల్పించే కడప–రేణిగుంట గ్రీన్‌ఫీల్డ్ నేషన్ హైవే నిర్మాణానికి కదిలిక ప్రారంభమైంది. ఈమేరకు బుధవారం రాజంపేట–రాయచోటి రహదారిలోని కూచివారిపల్లె వద్ద నిర్మాణసంస్ధ పనులకు శ్రీకారం చుట్టింది. నిర్వాహకులు భూమి పూజ చేశారు. ఈ హైవే నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ఉన్న పెద్దపల్లి, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వద్ద టోల్‌ప్లాజా నిర్మించనున్నారు. సోలాపూర్–కర్నూలు–చైన్నె జాతీయరహదారి(716)లో ఆంధ్రప్రదేశ్‌లో 329 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఇందులో కడప –రేణిగుంట వరకు 122 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసలుగా విస్తరించేలా ప్రాజెక్టు మంజూరైంది. అటవీశాఖ , పర్యావరణ అనుమతులు గత డిసెంబరులో వచ్చాయి. వైల్డ్‌లైఫ్(వన్యప్రాణి సంరక్షణ విభాగం) అనమతులు ఇస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే.
82 కి.మీ గ్రీన్‌ఫీల్డ్..
కడప–రేణిగుంట నేషనల్‌హైవేలో 82 కిలోమీటర్ల దూరం గ్రీన్‌ఫీల్డ్‌రోడ్‌గా పరిగణనలోకి తీసుకున్నారు. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల పరిధిలో 122 కిలోమీటర్ల హైవే కొనసాగుతుంది. కడప నుంచి భాకరాపేట వరకు ఇప్పుడున్న రెండు వరసల దారిని నాలుగు వరసలుగా మార్చుతారు. భాకరాపేట నుంచి రైల్వేకోడూరు అవతల శెట్టిగుంట వరకు 82 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్‌ఫీల్డ్ రహదారిని నిర్మితం చేయనున్నారు. శెట్టిగుంట నుంచి రేణిగుంట సమీపంలో ప్రస్తుతం ఉన్న హైవేను ఫోర్‌లైన్‌గా మార్చనున్నారు. రేణిగుంట వద్ద బైపాస్ 3,5 కిలోమీటర్లు నిర్మితం చేయనున్నారు. ఈ హైవే ప్రాజెక్టు రెండు ప్యాకేజీలుగా విభించారు. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు, తొలి ప్యాకేజిగాను విభించారు. చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 58 కిలోమీటర్ల దూరాన్ని రెండ ప్యాకేజీ కిందికి తీసుకొచ్చారు.
హైవే రాకతో తగ్గనున్న ట్రాఫిక్..
ప్రస్తుత కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబై, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గి, సర్వీసురోడ్డుగా మారునున్న రహదారిలో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి.
గ్రీన్‌ఫీల్డ్ హైవే కొంత భాగం అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి ఉంది. అందువల్ల ఒక నుంచి ఒకటిన్నర ఎత్తులో హైవే నిర్మాణం చేపట్టనున్నారు. వన్యప్రాణుల సంచరించేందుకు వీలుగా ఈ హైవే 5.5 కిలోమీటర్ల మేరకు 11 చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. వంతెనలపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించేలా.. కింది భాగంలో వన్యప్రాణులు తిరిగేలా సౌకర్యం కల్పించనున్నారు. కడప–రేణిగుంట ఎన్‌హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకునే పరిస్ధితులు ఆవిష్కృతమవుతాయి.


