ఎస్సీ రిజర్వేషన్ల శాతం పెంచాలి
కడప సెవెన్‌రోడ్స్ : ఎస్సీ రిజర్వేషన్ల శాతాన్ని వెంటనే పెంచాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్యమాదిగ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం సిద్ధించి 79 సంవత్సరాలైనా ఎస్సీలకు రిజర్వేషన్లు 15 శాతం మాత్రమే ఉన్నాయన్నారు. జనాభా పెరిగినప్పటికీ దానికి అనుగుణంగా రిజర్వేషన్లు పెంచకపోవడం విచారకరమన్నారు. కుల గణాంకాల సేకరణ చేపట్టి జనాభా మేరకు షెడ్యూల్ కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కార్యక్రమంలో మాదిగ డప్పు చర్మకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ కె.నాగభూషణం, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పి.ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.
కౌలు రైతు ఆత్మహత్య
కొండాపురం : మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన సోమల రామమోహన్‌రెడ్డి(40)బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు ఎస్. రామమోహన్‌రెడ్డి 3.5 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని కూరగాయల పంట సాగు కోసం అప్పులు చేశాడు. అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు ఎలా తీర్చాలని మనస్తాపంతో ఇంట్లో ఊరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
రాజుపాళెంలో కొండ చిలువ కలకలం
రాజుపాళెం : రాజుపాళెం గ్రామ శివారులో కొర్రపాడు గ్రామానికి వెళ్లే రహదారిలో ఉన్న ఓ డీజిల్ బంక్, ఓ రైస్‌మిల్ సమీపంలో సోమవారం రాత్రి కొండచిలువ కనిపించడంతో వాహనదారులు భయాందోళన చెందారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రొద్దుటూరు–ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో అడ్డంగా ఉండిపోయింది. దీంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు భయంతో వెనక్కి వెళ్లారు. కొద్ది సేపటి తర్వాత కొండ చిలువ పక్కనే ఉన్న చాపాడు కాలువ గట్టుపై ఉన్న గడ్డి, ముళ్లపొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో వాహనదారులు ఉపిరి పీల్చుకొని ముందుకు కదిలారు. గతంలో కూడా ఇక్కడే ఓ కొండ చిలువ కనిపించడంతో ఆ దారిలో తిరిగే రైతులు, వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు కొండ చిలువను పట్టుకొని కొండల్లో వదిలేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఎస్సీ రిజర్వేషన్ల శాతం పెంచాలి
ఎస్సీ రిజర్వేషన్ల శాతం పెంచాలి


