గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
వల్లూరు(చెన్నూరు), కడప అర్బన్ : సరదాగా ఈత కోసం వెళ్లి కడప సమీపంలోని వాటర్ గండి ప్రాంతంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం బయట పడ్డాయి. చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామాంజనేయపురానికి చెందిన కసినేని నాగేశ్వర రావు కుమారుడు కసినేని నరేష్ (18), అశోక్ నగర్‌కు చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు గండం రోహిత్ (16) మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు ఆదివారం సెలవు దినం కావడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ గండి ప్రాంతంలో పెన్నా నది వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి సరదాగా ఈత కొట్టి సెల్‌ఫోన్‌లతో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నరేష్, రోహిత్‌లు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా స్నేహితు ల్లో ఒకరైన అరుణ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతడు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోసాగాడు. అదే సమయంలో అందుబాటులో వున్న అక్కడి దేవాలయ వాచ్‌మెన్ ఆంజి అరుణ్‌ను రక్షించారు. నరేష్, రోహిత్‌లు నీటిలో గల్లంతయ్యా రు. సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు రాత్రి వరకు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. సోమవారం ఉదయం చెన్నూ రు సీఐ క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను చూసిన తల్లి దండ్రులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నరేష్‌కు తల్లిదండ్రులతో బాటు ఒక అన్న, ఒక సోదరి వున్నారు. రోహిత్‌కు తల్లిదండ్రులతో బాటు ఒక చెల్లెలు వున్నారు.
గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం


